అవును నిజంగా యడ్డీ రాజీనామా..
posted on Jul 26, 2021 @ 1:48PM
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, నెల రోజులకు పైగా సాగుతున్న రాజీనామా డ్రామాకు తెరదించారు. చివరాఖరుకు, ఈ రోజు (సోమవారం, జులై 26) న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎంగా యడ్యూరప్ప ఈరోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుక సభలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అధిష్ఠానామ్ ఆదేశం మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యాన్నం గవర్నర్’ ను కలిసి రాజీనామా సంర్పిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి యడ్డీ ఉద్వాసనకు ఇతర కారణాలు ఉన్నా 78 ఏళ్ల యడ్డీకి ఆయన వయస్సే ప్రధాన అవరోధంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జులై 26తో ఆయన ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలుపూర్తవుతాయని, అదే రోజున ఆయన రాజీనామా చేస్తారని చాలా కాలంగా వినవస్తోంది. మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి
అలాగే, యడ్యూరప్ప కూడా, నిన్న (ఆదివారం) అంతా బీజేపీ అధిష్ఠానం ఆదేశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అధిష్ఠానం ఏది చెపితే అదే శిరోథార్యం, పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. అలాగే, ఈ రోజు (సోమవారం) ఉదయం మరోమారు, ఆయన అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను తాను పాటిస్తానని స్పష్టం చేశారు. అధిష్ఠానం నుంచి సందేశం వస్తుందేమోనని ఆదివారం సాయంత్రం వరకు ఎదురుచూశానని, కానీ అలాంటిదేమీ రాలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానా లేదా అనే దానిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముందన్నారు.
అదే విధంగా ఈ ఉదయం పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఆయన ఈ మధ్యాన్నం గవర్నర్’ను కలిసి రాజీనామా సంర్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కర్నాటకానికి తెరదించారు.
అయితే, చివరి క్షణంలో ఆదివారం గోవాలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటకలో నాయకత్వ సంక్షోభమేమీ లేదని, ముఖ్యమంత్రి యడియూరప్ప తనదైన శైలిలో బాగా పనిచేస్తున్నారంటూ చేసిన ప్రకటన, కొంత గందరగోళం సృష్టించింది. గతంలో అనేక సార్లు ఆయనను పదవీ గండం నుంచి రక్షించిన అదృష్ట రేఖలు మరో మారు ఆయన్ని రక్షించాయన్న ఊహాగానాలు వినవచ్చాయి. అయితే, చివరాఖరుకు యడ్డీ అదృష్ట రేఖలను వయసు ఓడించింది. ఆయన రాజీనామాకు సిద్దమయ్యారు.