అక్కడ జగన్ బొమ్మ చెల్లకే నన్ను బతిమాలారు.. వైసిపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు
posted on Jun 15, 2020 @ 4:35PM
వైసిపిలో కాస్త గట్టిగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పై కోర్టులలో ఇబ్బందులు తప్పవని ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. మొన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదని అయన వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే విషయం పై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజు.. రఘురామకృష్ణం రాజు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు ,. మీరు జగన్ దయతో ఎంపీ అయ్యారని, అలాగే పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ను అయ్యారని విమర్శించారు.
దీని పై స్పందించిన ఎంపీ రఘురాం తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని ఐతే పార్టీలోకి తనంతట తానుగా రాలేదని.. తనను కాళ్ళా వేళ్ళా బతిమాలితేనే వచ్చానని అయన అన్నారు. నరసాపురం టీడీపీకి కంచుకోట అని రాష్ట్రమంతా గెలిచినా ఇక్కడ కూడా గెలవాలనే ఉద్దేశ్యంతో తనను రావాలని కోరితే పార్టీలోకి వచ్చానని అన్నారు. అంతకు ముందు కూడా ఒకసారి పార్టీలోకి రావాలని పార్టీ నాయకులూ అడిగితె ఛీ కొట్టానని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పాలకొల్లు లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 19 వేల మెజారిటీతో, ఉండి నుండి కొత్త అభ్యర్థి 12 వేల మెజారిటీతో గెలిచారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. అదే వైసిపి నేతలు తణుకు, నరసాపురం లలో తక్కువ మెజారిటీతో గట్టెక్కారని అన్నారు. నరసాపురం లో అయన బొమ్మ చూపించి నెగ్గే పరిస్థితి లేదని రఘురాం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు ఎంపీ సీటు ఎలా వచ్చిందో అసలు విషయం ఎమ్మెల్యే ప్రసాద రాజుకు కూడా తెలుసునని అలాగే ఆయనతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసునని ఆయన అన్నారు. మిగిలిన వారిలాగా తనకు డబ్బులు కలెక్ట్ చేయడం తెలీదని అయన ఎద్దేవా చేసారు. తనను విమర్శిచినందుకు ప్రసాద రాజుకు త్వరలో మంత్రి పదవి వస్తుందన్నారు.