అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు?.. జగన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేశారా?
posted on Sep 17, 2025 @ 3:06PM
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని ఇప్పటికే పలు మార్లు వైసీపీ అధినత జగన్ చెప్పారు. అయితే మాట అదే అయినా, ఇప్పుడు చేత మారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కూడా జగన్ స్వయంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోవడం లేదని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడమే ఖరారైతే.. ఆయన హడావుడిగా తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావలసిన అవసరం లేదు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల రోజునే అంటే గురువారం (సెప్టెంబర్ 18)న తన తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. దీనిపై జగన్ సొంత మీడియా కూడా క్లారిటీ ఇచ్చింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారని పేర్కొంది.
దీనిని బట్టి ప్రతిపక్ష హోదా విషయాన్ని వదిలేసి జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి హాజరౌతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ జగన్ తాను డుమ్మా కొట్టి, తన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలనూ సభకు పంపుతారా? అన్న అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక వేళ జగన్ అసెంబ్లీ బహిష్కరణకే కట్టుబడి ఉంటే.. ఆయన ఆదేశాలను ధిక్కరించి అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో జగన్ వ్రతం చెడ్డా ఫలమైనా దక్కితే చాలన్నట్లుగా అసెంబ్లీ హాజరుకు, ప్రతిపక్ష హోదాకూ ముడిపెట్టవద్దన్న నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన స్నేహితుడు అయిన కేసీఆర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినప్పటికీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరౌతున్నారు. జగన్ కూడా అదే విధంగా తాను అసెంబ్లీకి గైర్హాజరైనా పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించుకున్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీలో ఆయన ఎమ్మెల్యేలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీని వల్ల జగన్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని కూడా అంటున్నారు. జగన్ హాజరు కాకుండా ఎమ్మెల్యేలను సభకు పంపినా జగన్ పారిపోయారన్న విమర్శలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.