వైసీపీ ఎమ్మెల్యేకు యువకుల షాక్
posted on Mar 26, 2021 @ 1:01PM
ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్యే. అయితేనేం అన్యాయం చేస్తే ఊరుకుంటామా అంటూ నిలదీశారు ఆ యువకులు. కారు దిగిన ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే సైతం ఘాటుగా రియాక్ట్ అవడంతో వివాదం ముదిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈలోగా స్థానికులు కలగజేసుకొని ఎమ్మెల్యేను కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ ఎమ్మెల్యేకు యువకులు చుక్కలు చూపించిన ఈ ఘటన విశాఖ జిల్లాలో కలకలం రేపింది.
పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వేపగుంట ముత్యమాంబ పండుగలో స్టేజీల ఏర్పాటు విషయంలో అదీప్‌రాజ్‌ను నిలదీశారు స్థానిక యువకులు. స్టేజీలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఆ తరువాత రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. గ్రామ దేవత పండుగలో రాజకీయాలు చేస్తారా అంటూ నిగ్గదీసి అడిగారు. ఎమ్మెల్యే కారును అడ్డగించి దుర్భాషలాడారు.
వేపగుంట ముత్యమాంబ పండుగకు సంబంధించి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు స్టేజీలు ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత స్టేజీలకు అనుమతి లేదంటూ అధికారులు రివర్స్ కావడంతో వారు కంగుతిన్నారు. దీనికి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ కారణమని భావించిన యువకులు.. పినగాడి నుంచి వేపగుంట వైపు వెళుతున్న ఎమ్మెల్యే కారును ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి అడ్డగించారు. ఎమ్మెల్యేను చుట్టముట్టారు. స్టేజీల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను అధికార బలంతో అడ్డుకున్నారని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టేజీ ఏర్పాటు అనుమతుల రద్దు వెనుక రాజకీయ ప్రమేయం లేదని ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఘాటుగా సమాధానం చెప్పడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అనుమతులు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబట్టడంతో సమయం అయిపోయిందని ఎమ్మెల్యే తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో స్థానికులు కొందరు కలగజేసుకుని.. ఎమ్మెల్యేను కారెక్కించి అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు జరిగిన చేదు అనుభావం స్థానికంగా సంచలనంగా మారింది.