ఆమోదం లేకుండానే 55 వేల కోట్ల ఖర్చు! కడిగిపారేసిన కాగ్
posted on Mar 26, 2021 @ 1:59PM
విద్యా రంగానికి నిధులు ఇవ్వడం లేదు.. రవాణా, క్రీడలు, కళలకు ఖర్చును తగ్గించారు.. సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నా.. వాటి ఆర్థిక ఫలితాలు చెప్పడం లేదు.. ఇవీ తెలంగాణ సర్కార్ పై కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ చేసిన అభియోగాల. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్ .. పలు కీలక అంశాలను వెల్లడించింది. వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ... వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదని తెలిపింది.
తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడి లేదని కాగ్ వ్యాఖ్యానించింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్దీకరించాలని సూచించింది.
రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018- 19 మధ్య కాలంలో మెరుగైందని, జీఎస్డీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని కాగ్ పేర్కొంది. అంతకు ముందుతో పోల్చినా, జీఎస్టీడీపీతో పోల్చినా క్యాపిటల్ వ్యయం తగ్గిందని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25శాతం కన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే 3.11శాతం ఉందని పేర్కొంది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కన్నా తక్కువగానే 22.75 శాతం ఉందని తెలిపింది.
2019 మార్చి నాటి ప్రకారం ప్రభుత్వ అప్పులలో 46శాతం రూ,76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుంచి 2017-18 మధ్య రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చే చేసిందని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్ సిఫారసు చేసింది.