పవన్ కల్యాణ్ కు వైసీపీ ఆహ్వానం
posted on Feb 12, 2021 @ 10:50AM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ కాక రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు కర్మాగారం కార్మికులు భగ్గుమంటున్నారు. పోరాడి హక్కుగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ వాసులు రోడ్డెక్కుతున్నారు. ఏపీ సర్కార్ కు తెలిసే డీల్ అంతా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. 2019లో పోస్కోతో ఒప్పందం జరిగిన విషయం తెలిసినా.. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని మండిపడుతోంది. తమపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక ఒడిషా కుట్ర ఉందని చెబుతున్నారు.
విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై తాగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పరిశ్రమపై వైసీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని తెలిపారు. త్వరలోనే ప్రధాని మోడీని కూడా కలిసి.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని విన్నవిస్తారని చెప్పారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాము చేస్తున్న పోరాటానికి కలిసి రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కూడా తమతో కలిసి పోరాటం చేయాలని కోరారు.
స్టీల్ ప్లాంట్ భూములు కాజేయాలని పోస్కో ప్రయత్నాలు జరుపుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బెంగాల్, ఒడిషాలో పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా అని మండిపడ్డారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే హక్కు ప్రధాని, సీఎంకు ఉండదని అన్నారు. పక్క రాష్ట్ర కేంద్ర మంత్రి వల్ల ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద కార్మికులు చేస్తున్న దీక్షకు మంత్రి అవంతి శ్రీనివాస్ మద్దతు తెలిపారు.