కొడాలి నానికి ఎస్ఈసి షాక్..
posted on Feb 12, 2021 @ 1:08PM
ఏపీ మంత్రి మాటలకు అంతులేదు .. ఉన్నత అధికారులంటే గౌరవం లేదు.. నోటికి వచ్చిన మాట వెనక్కి వెళ్లగక్కడమే కానీ వెనక్కి తగ్గేది లేదు.. అదే మంత్రి కొడాలి నాని తీరు.. ఎప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా ఉంటారు ఆయన.. కొడాలి నానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. శుక్రవారం మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ మంత్రి కొడాలి నాని మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. మంత్రికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోగా వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఎన్నికల సంఘం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్నాథ రథ చక్రాల కింద పడి నలిగిపోతారని అన్నారు. తాము పనికిమాలిన మీడియాను నమ్ముకోలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ విజయం సాధిస్తుందని మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. ఏపీ సీఎం జగన్ చిటికెనవేలిని కూడా ఎవరూ తాకలేరంటూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు.