రామ రామ.. అపచారం.. అపచారం!
posted on Jan 13, 2024 5:50AM
వైసీపీ నేతలలో పైత్యం పీక్స్ కు చేరింది. అందుకే వారి కళ్ళకు తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు జగన్ అంటే వీరుడు, శూరుడు అంటూ పొగిడిన ఆ నోళ్లు ఇప్పుడు ఏకంగా తమ నాయకుడు దేవుడే అంటున్నారు. అందునా నీతికి, ధర్మానికి, ఇచ్చిన మాటకి కట్టుబడి రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసిన శ్రీరాముడితో జగన్ మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు. మాట ఇవ్వడమే కానీ, దానికి కట్టుబడటం అన్నది డిక్షనరీలోనే లేని జగన్ ను శ్రీరామ చంద్రుడిగా చెప్పుకోవడం చూస్తుంటే వైసీపీ నేతల పిచ్చి ముదిరిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించి, అనుసరించే జగన్ మోహన్ రెడ్డిని శ్రీరామునితో పోల్చడం అంటే అది హైందవ ధర్మాన్ని కించపరచడమేనని హిందూ వాదులు మండిపడుతున్నారు. గతంలో కూడా వైసీపీ నేతలు అత్యుత్సాహంతో జగన్ మొహాన్ని శ్రీరాముని ఫోటోతో మార్ఫింగ్ చేసి తమ నేతపై భక్తిని చాటుకున్నారు. అప్పుడే శ్రీరాముడి ఫోటోలకు క్రిస్టియన్ అయిన జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి హిందు సమాజాన్ని వైసీపీ నేతలు అవమానించారని హిందూ వాదులు, పండితులు తీవ్రంగా మండిపడ్డారు.
గతంలో ఒకసారి గుంటూరు గోరంట్ల వద్ద శ్రీరాముడి ఫోటోలకు జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి జగన్ మోహన్ రెడ్డినే రామ లక్ష్మణులుగా ఫ్లెక్సీలు వేసి చూపించారు. అప్పుడే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. రాష్ట్రంలో పలుచోట్ల హిందూవాదులు, తెలుగుదేశం నేతలు రామాలయాలలో పూజలు జరిపి జరిగిన అపచారానికి కీడు కలగకుండా క్షమించి రాష్ట్రాన్ని కాపాడమని వేడుకున్నారు. అయితే ఇప్పుడా ఈ పిచ్చిఇంకా ముదిరిపోయింది. వైసీపీ నేతలు మరోసారి తన నాయకుడు జగన్ని అపర శ్రీరాముడంటూ శ్రీరాముని అంతటి వారంటూ తెగ పొగిడేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ప్రచారానికి కూడా వైసీపీ నేతలు శ్రీరాముడి పేరును వాడుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో కూడా జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏకంగా శ్రీరాముని అవతారంలో జగన్ ఫోటోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్తా ఇప్పుడు మరోసారి ఏపీలో చర్చకు దారితీసింది.
అయితే, ఇంతకీ జగన్ శ్రీరాముడంతటి గొప్పవాడా? శ్రీరాముని పాలనా దక్షత, ఆయనలోని దైవత్వం జగన్ లో నిజంగా కనిపిస్తున్నదా? దేవుని అవతారమైన రాముడు హిందువులకు ఆరాధ్య దైవం. అసలు మనిషి ఎలా బ్రతకాలి అంటే ఎవరైనా శ్రీరాముడినే ఆదర్శంగా చూపిస్తారు. అలాంటి దేవుడిని వైసీపీ జగన్ కోసం కించపరచడం ఎంత వరకు సబబు? జగన్ మోహన్ రెడ్డి పుట్టుకతోనే క్రైస్తవుడు. జగన్ తాత క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తాతలు, తండ్రులు అదే కొనసాగించారు. ఇక ఇప్పుడు జగన్ కు క్రైస్తవ మతంపై అమితమైన ప్రేమ ఉంది. జగన్ హిందువు కాదు అసలు సిసలైన క్రైస్తవుడేనని ఎవరూ దృవీకరించాల్సిన అవసరం లేదు. మరి అలాంటి వ్యక్తిని శ్రీరాముడితో పోల్చడం అంటే ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు. జగన్ ను రామునితో పోల్చడం వైసీపీ హిందు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మరి వైసీపీ నేతలు ఇంతలా దిగజారి జగన్ భజన చేయడం ఏంటి?.
నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వరుసగా హిందు దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవుని రధాలు తగలబెట్టారు. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు. వాటికి కారణమైన ఏ ఒక్కరినీ ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. జగన్ ప్రభుత్వంలో అన్నీ అరాచకాలేనని నిర్ధారణైపోయింది. ప్రశ్నిస్తే దాడులు.. వ్యతిరేకిస్తే అరెస్టులు. ఎటు చూసినా అప్పులు.. ఇదేమిటని అడిగినవారిపై దౌర్జన్యాలు. మరి ధర్మ పాలకుడైన రాముడితో అరాచక పాలన చేస్తున్న జగన్ ను పోల్చడం ఏమిటి? హిందూ దేవుళ్ళ విగ్రహాల తల నరికి దేవాలయాలు ధ్వంసంచేస్తున్నా పట్టించుకోని జగన్మోహనరెడ్డిని రాముడుతో పోల్చడంకన్నా నీచమైన చర్య ఇంకొకటి ఉండదనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు గంగలో మునిగి హిందూ సమాజాన్ని మోసం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని అణచివేయాలని తెరచాటు ప్రయత్నాలు చేశారు. అందుకే దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు. అలాగే హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కూడా ఇతర మతాల దాడిని పెంచి పోషించారు. అన్యమత ప్రచారానికి తలుపులు బార్లా తెరిచేశారు. టీటీడీ టికెట్లపై అన్య మత ప్రచారం, తిరుమలలో గోడలపై పార్టీ రంగులు వేసినా చర్యలు తీసుకోలేదు. పైగా తిరుపతిలో పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం.. తిరుమల దేవుడి నిధులను వాడుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రామునితో పోల్చడం అంత దుశ్చర్య మరొకటి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.