వసుధైక కుటుంబానికి నిలువెత్తు నిదర్శనం మంగళగిరి.. లోకేష్
posted on Jan 13, 2024 8:21AM
మంగళగిరి నియోజకవర్గాన్ని వసుధైక కుటుంబంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా విభిన్న కుల,మతాల సమాహారంగా మంగళగిరి నియోజకవర్గం ఉందని పేర్కొన్నారు. అటువంటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ... గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులను ఇళ్లవద్దకు వెళ్లి కలుస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం జనవరి 12) పలువురు ప్రముఖులను వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్న లోకేష్... మంగళగరిని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికలను వివరించి మద్దతు కోరారు. ముందుగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన చెంచు సామాజికవర్గ పెద్ద తిరుపతయ్య నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా లోకేష్ ను సాదరంగా ఆహ్వానించిన తిరుపతయ్య కుటుంబ సభ్యులు చెంచుల సమస్యలను ఆయనకు వివరించారు.
పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్న, సంచారజాతి అయిన తమ సామాజికవర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెంచుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. అనంతరం పెదవడ్లపూడికి చెందిన లంబాడీ సామాజికవర్గ ప్రముఖుడు జరపాల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. తరువాత మంగళగిరి 10వవార్డుకు చెందిన ప్రముఖ చేనేత వ్యాపారి, వైష్ణవి టెక్స్ టైల్స్ అధినేత వెనిగళ్ల శంకర్రావును ఆయన నివాసంలో కలిశారు. మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైన శంకర్రావు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేతలు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. ఆ తరువాత మంగళగిరి 15వవార్డుకు చెందిన మరో ప్రముఖుడు కొల్లి నాగేశ్వరరావును, మంగళగిరి మాజీ శాఎమ్మెల్యే కాండ్రు కమల ప్రముఖ స్వచ్చంద సంస్థ ఖిద్మత్ టీమ్ సభ్యులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.