కరోనాపై జగన్ చేతులెత్తేశారు! వైసీపీ నేతల వీడియో వైరల్
posted on May 6, 2021 @ 11:37AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో చికిత్స అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక చనిపోతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని చెబుతోంది. కరోనా కట్టడిలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై జనాలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విపక్షాలే కాదు వైసీపీలోనే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు... కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైందని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కరోనా గురించి మాట్లాడుకున్న నేతలు.. ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కరోనాతో చనిపోతే డెడ్ బాడీ తరలింపునకు 30 వేల రూపాయలు, దహన సంస్కారాలకు 12 వేలు వసూల్ చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమి చేయడం లేదని చెప్పుకున్నారు. కరోనాతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా... జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలు గుసగుసలాడుకున్నారు.
కరోనా కట్టడి, జగన్ సర్కార్ తీరుపై రాజమండ్రిలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము మొదటి నుంచి చెబుతున్న మాటలే వైసీపీ నేతలు అంటున్నారని, ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చని విపక్ష నేతలు అంటున్నారు. రాజమండ్రి వైసీపీ నేతల వీడియో అధికార పార్టీలో కలవరం రేపుతుందని తెలుస్తోంది.