పార్టీని చంపేసింది జగనే.. వైసీపీలో మొదలైన పోస్టుమార్టం!
posted on Jun 24, 2024 @ 12:16PM
ప్రత్యర్థి పార్టీలు సైతం పార్టీలు సైతం జాలిపడేంత ఘోర ఓటమి పాలైన వైసీపీ.. ఇప్పుడు తమ ఓటమికి కారణాలపై పోస్టు మార్టం మొదలు పెట్టింది. అయితే ఈ పని చేస్తున్నది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాదు. ఇంత కాలం అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం జగన్ మాటే శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు. అది కూడా జగన్ మీద ఈగ వాలకుండా పార్టీలోని కొందరిని టార్గెట్ చేసి చేస్తున్న ఈ పోస్టు మార్టం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖలో అక్రమంగా నిర్మితమైన వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించడంపై స్పందించారు. అయితే ఆయన స్పందన పార్టీ కార్యాలయ నిర్మాణం అక్రమమని అంగీకరిస్తూనే.. కూల్చివేతకు పాల్పడి మేం చేసిన తప్పు మీరు చేయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. ప్రజావేదిక నుంచి తమ పార్టీ చేసిన విధ్వంసం కారణంగానే ఘోరంగా ఓటమి పాలయ్యామని అంగీకరించేసినట్లుగా వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇక అదే పార్టీకి చెందిన మరో నేత కాసు మహేష్ రెడ్డి అయితే.. ప్రత్యర్థి నేతలపై అనుచిత భాషా ప్రయోగం వల్లే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందని మీడియా ముందు అంగీకరించేశారు. అలాగే నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం కూడా పార్టీ పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటని ఒప్పేసుకున్నారు.
చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు కారణంగా జనాగ్రహం జగన్ సర్కార్ పతనాన్ని శాశించిందని కాసు మహేష్ రెడ్డి సోదాహరణంగా వివరణ ఇచ్చారు. బేంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ ఒకరు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ఒంటి పూట భోజనమే చేస్తానని శపథం చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వరకూ నల్ల చొక్కాలే ధరించిన సంగతి చెప్పారు. అంతే కాదు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబాలు కూడా వైసీపీ ఓటమి కోరుకుంటూ మొక్కుకున్న సంగతిని చెబుతూ.. జగన్ ప్రభుత్వం గద్దెదిగిన తరువాత తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్న కుటుంబాలు అనేకం ఉన్నాయని చెప్పారు.
ఇవన్నీ వైసీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డి మీడియా ముందు చెప్పిన సత్యాలు. అనుచిత వ్యాఖ్యలు అంటూ కొడాలి నాని వంటి ఒకరిద్దరి పేర్లతో ఆయన విమర్శలు చేశారు కానీ.. వాస్తవంగా ఆయన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలన్నీ జగన్ కు ఎక్కుపెట్టినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనుచిత భాష వాడుతున్న నేతలను కంట్రోల్ చేయడమటుంచి.. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన విమర్శలూ కూడా నాని తదితరుల భాషా పాండిత్యానికి ఏమీ తక్కువకాదని వివరిస్తున్నారు.