తాలిబన్ల తాతల్లా వైసీపీబన్లు.. నాటుతుపాకీల తయారీ కేంద్రంగా ఏపీ..
posted on Sep 2, 2021 @ 6:00PM
తాలిబన్లు తెలుసుగా. అఫ్ఘనిస్తాన్‌లో అరాచక పాలనకు మళ్లీ శ్రీకారం చుట్టిన ముష్కరులు. తాలిబన్ల రాజ్యం వస్తుందనగానే అఫ్గన్ ప్రజలంతా భయంతో దేశం వదిలి పారిపోతున్నారు. గతంలో తాలిబన్లు చేసిన అరాచకాలు అలాంటివి మరి. ఏపీలోనూ వైసీపీ పాలకులు, నాయకులు... తాలిబన్ల తాతల్లా తయారయ్యారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ శ్రేణులను తాలిబన్లతో పోలుస్తూ.. వైసీపీబన్లు అంటూ పేరుపెట్టారు. అధికార పార్టీ అరాచకాలను తాలిబన్లతో పోల్చుతూ.. సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైసీపీబన్లు అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారని అననారు. వైసీపీబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే... జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయంటూ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటేశ్ అనే వ్యక్తి 18 నాటు తుపాకులు తయారు చేయగా.. అతన్ని పోలీసులు పట్టుకున్న న్యూస్ క్లిప్పింగ్‌ను తన ట్వీట్‌కు జత చేశారు నారా లోకేశ్.
మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందంటో మరో ట్వీట్ కూడా చేశారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టుల పై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలంటూ మండిపడ్డతూ కొన్ని ఫోటోలు జత చేశారు.
మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా ప్రభుత్వం టీడీపీ నేతల్ని వేధిస్తూనే ఉందని మండిపడ్డారు. కేసులు పెట్టి ఉన్మాదుల్లా పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేసినందుకు చింతమనేని ప్రభాకర్‌ని అరెస్ట్ చేశారన్నారు. దేవాలయానికి వెళితే గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా.. టీడీపీ నేతల్ని వేధిస్తున్నారన్నారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తోందన్నారు. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. తప్పులు బయటపడతాయనే భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జగన్‌రెడ్డి సర్కారును దుయ్యబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.