ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష! వైఎస్ కుటుంబం పాలనలో అంతేనా?
posted on Sep 2, 2021 @ 4:37PM
ఐఏఎస్ శ్రీలక్ష్మి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన అధికారిణి. సీన్ కట్ చేస్తే వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లింది. చాలా కాలం పాటు చెరసాల జీవితం గడిపింది. అక్కడే అనార్యోగానికి కూడా గురైంది. శ్రీలక్ష్మి ఒక్కరే కాదు రత్నప్రభ, పార్థసారథి, శ్యామూల్స్ తదితర సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కోర్టు కేసులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ ప్రభుత్వం గురించి చెప్పగానే... ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లిన విషయాలు గుర్తుకు వస్తాయి.
గత పరిస్థితులు గుర్తుకు వచ్చేలా.. ఏపీలో కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారులు వరుసగా కోర్టుల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. కొందరికి జైలు శిక్షలు కూడా పడుతుండటం కలకలం రేపింది. జగన్ తన పాలనలో కోర్టుల ఉత్తర్వులను, ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ విధానాలతో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు ఉంటుండటంతో .. తర్వాత కాలంలో ఐఏఎస్ అధికారులు ఇబ్బందుల్లో పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు.. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వారి జీతాల నుంచి కోత పెట్టి పరిహారం అందించాలని ఆదేశించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ప్రస్తుతం సీఎంవోలో ఉన్న ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది ఏపీ హైకోర్టు.
గత జూలైలోనూ ఓ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. జగన్ ప్రభుత్వంలో కీలక శాఖల అధికారులుగా కొనసాగుతున్న ఐఏఎస్ లు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 36 మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఏప్రిల్ లో ఆదేశాలు జారీ చేస్తే… వీరు వాటిని ఇప్పటిదాకా అమలు చేయలేదు. దీంతో వారిద్దరికీ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలతో వైఎస్సార్ లానే జగన్ ప్రభుత్వంలోనూ అధికారులకు చిక్కులు తప్పవా అన్న చర్చ జరుగుతోంది. కోర్టు కేసులతో తమకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన సివిల్ సర్వెంట్లలో కనిపిస్తోందని చెబుతున్నారు.