నాడు-నేడు అంతా మోసం.. పనులన్నీ వాళ్లకే.. వైసీపీ నేత కలకలం..
posted on Sep 13, 2021 @ 1:57PM
నాడు-నేడు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పధకం. పేరు గొప్పే. కానీ, యవ్వారమే దిబ్బగా మారిందంటున్నారు. నాడు-నేడులోనూ కాసుల దండుకునే కార్యక్రమం జోరుగా సాగుతోందని ఆరోపిస్తున్నారు. వైసీపీ పెద్దల అనుకూల కాంట్రాక్టర్లకు మాత్రమే దోచిపెడుతున్నారని.. చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపిస్తూ ఓ బాధితుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం.. అది వైరల్‌గా మారడం.. ఏపీలో కలకలం రేపుతోంది.
వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న నాడు-నేడు పనుల నిర్వహణలో పారదర్శకత లేదు. అంతా మోసం జరుగుతోంది. కాంట్రాక్టర్లదే రాజ్యం నడుస్తోంది. బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగడం లేదు.. అంటూ సాక్షాత్తూ అధికార వైసీపీకి చెందిన ఓ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆరోపించడం సంచలనంగా మారింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన తల్లిదండ్రుల కమిటీ చైర్మనే ఈ విధంగా వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. గుర్రపుశాల ఎంపీపీ పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరనుకున్నట్లు నాడు-నేడు పనుల్లో పూర్తి పారదర్శకత లేదని తెలిపారు. ఇక్కడా పనులన్నీ కాంట్రాక్టర్లే చేస్తున్నారని వాపోయారు. తాను చేసిన కొద్దోగొప్పో పనుల బిల్లులూ ఆగిపోయాయని అన్నారు. ఉన్నతాధికారులకు. ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సమస్యను విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకపోతే ఈనెల 22వ తేదీ జరగనున్న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికను బహిష్కరిస్తానని హెచ్చరించారు. తన వీడియో సందేశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు గుర్రపుశాల ఎంపీపీ పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి.