చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ
posted on Sep 15, 2020 @ 11:57AM
ఢిల్లీలో నిన్ననే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుండగా మరో పక్క రాష్ట్రాలకు చెందిన వివిధ సమస్యలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించి రాజధాని అంశంలో ఇటు అమరావతి రైతులు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. మరో పక్క సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మూడు రాజధానులను అడ్డుకునేందుకు లోక్ సభలో పోరాటానికి సిద్దమయ్యారు. ఇప్పటికే దీని గురించి టీడీపీ ఎంపీలు నిన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ను కలిసి ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితుల పై వివరించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా ఎంపీలు అధికారులకు గుర్తు చేసారు. దీంతో న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా టీడీపీ ఎంపీలు తెలిపారు. దీంతో పాటు ఈ అంశాన్ని లోక్ సభ ప్రస్తుత సమావేశాల్లో లేవనెత్తి అమరావతికి న్యాయం జరిగే దిశగా పోరాటం చేయాలనీ నిర్ణయయించారు.
అయితే టీడీపీ ఎంపీల ఈ ప్రయత్నాన్ని తిప్పి కొడుతూ ఒక పక్క మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ.. మరో పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసిపి పావులు కదుపుతోంది. దీని కోసం ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలు, ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే దీని పై ఇంకా కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల పై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ లోక్ సభలో ఈ అంశం లేవనెత్తబోతున్నారు. దీంతో అటు అమరావతి నుండి రాజధానిని మార్చడంతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను టార్గెట్ చేసి ప్రతిపక్షాన్ని కోలుకోలేని దెబ్బకొట్టే ఆలోచనలో వైసిపి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏమైనా సరే రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీపీ కేంద్రాన్ని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. టీడీపీ అధినేత తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలకు కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్ననేపథ్యంలో సిబిఐ విచారణ కు కేంద్రం ఒప్పుకుంటే ఇక టీడీపీ గట్టి దెబ్బ అనే ఆలోచనలో వైసిపి అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నటుగా ఇటు రాజధాని మార్పుతో పాటు అటు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయవచ్చనేది వైసిపి మంత్రాంగం గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో వైసిపి ఎంతవరకు విజయవంతమౌతుందో వేచి చూడాలి.