ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీలే.. అయినా బస్సులు మాత్రం రోడ్డెక్కవు
posted on Sep 15, 2020 @ 12:46PM
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు జాన్ జిగ్రీలు అన్న సంగతి అందరికి తెల్సిందే. గత సంవత్సరం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ పార్టీకి అండగా ఉండి అయన గెలుపుకు సాయపడ్డారని అటు టీడీపీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ ఇప్పటివరకు అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటు టీఎస్ఆర్టీసీ కానీ రెండు రాష్ట్రాల మధ్య బస్సులను మాత్రం నడపడం లేదు. దీనికి కారణం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతం వీడక పోవడమే అని తెల్సుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు జరిగినా అవి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగాయి. దీని కోసం దాదాపు మూడు నెలలుగా రెండు రాష్ట్రాల అధికారులు చర్చించడం.. ఆ తరువాత బస్సులు నడపడంపై ఏదీ తేల్చకుండా ముగిస్తున్నారు. ఈక్రమంలోనే ఈరోజు మరోసారి రెండు రాష్ట్రాల అధికారులు ఈ అంశం పై చర్చించేందుకు సమావేశమవుతున్నారు.
ఇంతకు ముందు జరిగిన సమావేశాలలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు సమాన దూరం నడుపుకుందామన్న తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల ప్రారంభంపై ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా ప్రబలక ముందు వరకు తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా.. టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీ పరిధిలో 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చలలో తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటే…తెలంగాణ 50వేల కిలోమీటర్ల పరిధి పెంచుకుంటే సరిపోతుందని ఏపీ ప్రతిపాదించింది. అయితే ఆ స్థాయిలో టీఎస్ఆర్టీసీ వద్ద బస్సులు సిద్ధంగా లేని కారణంగా తెలంగాణ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తాము గతంలో నడిపినట్టుగానే సర్వీసులు నడిపిస్తామని స్పష్టం చేయడంతో ఇంతకుముందు జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడం పై స్పష్టత రాలేదు. మరో పక్క ఏపీ రవాణా శాఖ.. మంత్రుల స్థాయి భేటీకి ప్రయత్నించగా దానికి తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ నో చెపుతూ.. ముందుగా అధికారుల మధ్య చర్చలు సఫలం అయితేనే రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో కనీసం ఈసారి అధికారుల స్థాయి చర్చలలోనైనా ఒక ఒప్పందానికి వచ్చి బస్సులు నడిపిస్తారో లేదో వేచి చూడాలి.