వైసీపీకి ఘోర పరాజయమే.. తేల్చేసిన పల్స్ టుడే ఎగ్జిట్ పోల్
posted on Jun 1, 2024 @ 6:53PM
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.
ఇక లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం కూటమికి 19 నుంచి 20 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే 5 నుంచి ఆరు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాలోని 62 స్థానాలలో తెలుగుదేశం కూటమి 29 స్థానాలలో, వైసీపీ 23 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది.
అలాగే ఉత్తరాంధ్రలోని 34 శాసనసభ స్థానాలలో తెలుగుదేశం కూటమికి 23, వైసీపీకి 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో తెలుగుదేశం కూటమి 28, వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పల్స్‌టుడే ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 స్థానాలు ఉండగా తెలుగుదేశం కూటమి 27, వైసీపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూటమి 18, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పల్స్‌టుడే పేర్కొంది.