దర్శిలో వైసీపీ గూండాయిజం.. గొట్టిపాటి లక్ష్మిపై కత్తులతో దాడికి యత్నం
posted on May 13, 2024 @ 3:10PM
వైసీపీ మూకలు దర్శిలో రెచ్చిపోయాయి. మండల పరిధిలోనే బొట్ల పాలెం గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. రెండు రోజుల కిందట తెలుగుదేశం కార్యకర్తపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి భయంతోనే ఇలా దాడులకు తెగబడుతోందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. ఎన్నికల రోజు బొట్లపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ మూకలు జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కత్తులతో దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారు. దీనిపై గొట్టిపాటి లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి భయంతో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ ఈ గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి దౌర్జన్యాలకు తెగబడుతున్నారని విమర్శించారు. శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాతనే టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ మూకలు దాడులకు దిగినట్లు తెలిపారు. ఒక మహిళా డాక్టర్ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ తనపై కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఓటేయాలని, తాను అండగా ఉంటానని గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు.