రాజ్యసభకు వెళ్తానంటున్న యనమల .. చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా?
posted on Mar 14, 2025 @ 12:59PM
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు చంద్రబాబు 2013లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యనమల శాసనమండలి సభ్యుడుగా కొనసాగుతున్నారు.
2014లో ఎమ్మెల్సీగా ఉంటూనే చంద్రబాబు కేబినెట్‌లో యనమల కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీఏసీ చైర్మన్ వంటి పదవులు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీకి దక్కిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. బీటీ నాయుడు, బీద రవిచంద్రలను బీసీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు.
ఆ క్రమంలో యనమల తన పొలిటికల్ ఫ్యూచర్‌పై నోరు విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతానని యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తనను.. ఆ తర్వాత ఏం చేస్తారని అడుగుతున్న సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఇదే సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫలానా వారిని ఎంపిక చేశామని ఆయన చెబితే... స్వాగతించానన్నారు. తనకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పానన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి సేవలందించానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద యనమల రాజ్యసభ కోరిక తీరుతుందో లేదో చూడాలి