ఆసనాలే అందరికి శ్రీరామ రక్ష... ప్రపంచమంతా యోగా జపం..
posted on Jun 21, 2021 @ 10:10AM
ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంతదాకా.
జూన్ 21నే యోగాడేను జరుపుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్ 21.. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు పగలు ఎక్కువగా ఉన్న రోజుగా ప్రత్యేకత కూడా ఉంటుంది. ఆ గుర్తింపు తోనే .. అదే రోజును “అంతర్జాతీయ యోగా దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించారు. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. “యుజ” అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం.
2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది.2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.అప్పటి నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
యోగా ఇప్పటిదేమీ కాదు.. దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నవే. ‘అష్టాంగ యోగ’ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
యుగయుగాలుగా మన సనాతన భారత సంప్రదాయంలో ఇమిడి ఉండి, పూర్వికులెందరో తమ శారీరక, మానసిక ఉల్లాసానికి అనాదిగా ఆచరించిన సాధనం ‘యోగ సాధన’. ప్రాచీన కాలం నుండి ఎందరో మునులు, యతులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ‘’ఆసనాలు’’, ఆచరించిన శ్వాస సంబంధిత ‘’ప్రాణాయామాలు’’, క్రమంగా మనకు ‘యోగా’ పాఠాలుగా మారాయి అనడం అతిశయోక్తి కాదు… ఆ కాలంలోనే ‘పతంజలి’ మహర్షి మన వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా స్వయంగా ‘యోగ దర్శిని’ అనే గ్రంథాన్ని రచించారు. ఈ తాళ పత్ర గ్రంథం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా, ఎందరో యోగా గురువులు తమ సాధనలను, అనుభవాలను రంగరించి వేలాది యోగా పుస్తకాలను రంచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నారు.
పతంజలి మహర్షి భావనలో యోగా అనేది ‘అష్టాంగ యోగం’. అంటే ఈ యోగా అనే శాస్త్రాన్ని ‘’యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి’’ అనే ఎనిమిది భాగాలుగా విశ్లేషించి చెప్పారు పతంజలి మహర్షి. ఈ ప్రాచీన పద్దతులను ఆచరిస్తూ విశ్వవ్యాప్తంగా ఎందరో యోగ సాధకులుగా, యోగా గురువులుగా కొనసాగుతున్నారు. యోగాకు సంబంధించిన యోగశాస్ర్తాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. భారతదేశంలో పురుడుపోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది.
2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్‌సన్ అభిప్రాయం. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు. అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిన్‌సన్ వివరించారు.
జన్మలపరంపరకు కారణమైన చిత్తవృత్తులను నిరోధించి, జననమరణ చక్రం నుంచి ఉద్ధరించేది యోగం అన్నారు యోగసూత్రాల్లో పతంజలి మహర్షి. మనం యోగా అంటున్నాం కానీ నిజానికి దాన్ని యోగ్ లేదా యోగం అనే అనాలిట. యోగం అనే సంస్కృతపదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్దం కలియకు. ఎవరి కలియక? జీవాత్మ, పరమాత్మల కలియకకు, లేక ఆ కలియకలు కారణమయ్యే ప్రక్రియకే యోగం అని పేరు.
యోగ అంటే కేవలం ఆసనాలే అని అనుకుంటున్నారు. కాదు కాదు అలా చేశారు. ఒకప్పుడూ యోగ్ కేవలం భారతదేశానికి, తూర్పు ఆసియాదేశాలకు, సనాతనహిందూ ధర్మం వ్యాపించిన దేశాలకే పరిమితమైంది. దానికి కారణం కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతానికి యోగకు అవినాభావ సంబంధం ఉంది. యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాల్లో ఆఖరిది సమాధి - భగవంతునిలో లీనమైపోవటం- మోక్షం. ఆసనాలు 3 వ మెట్టు. ధ్యానం చేయండి అంటూ తరుచూ ప్రకటనలు, సలహాలు ఇస్తుంటారు. ధ్యానం యోగంలో 7 వ మెట్టు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. యోగం యమనియమాలతో మొదలవుతుంది. యోగకు ఆహారనియమాలు తప్పనిసరి. కానీ ఈరోజు దాన్ని ప్రపంచంలో అనేకమంది మార్కెటింగ్ చేసి వ్యాపారం చేస్తున్న కారణంగా అసలు విషయాలు చెప్పడంలేదు. యోగం అనేది ఒక జీవనవిధానం. యోగం ద్వారా పరమాత్మను ప్రాతి పొందాలంటే అష్టాంగ యోగాన్ని అవలంబించాలి.
హిందూధర్మమే జీవనవిధానం. అందులో యోగం ఒక భాగం. హిందూ ధర్మం, పునర్జన్మ సిద్ధాంతం లేని యోగం అసంపూర్ణం. యోగం హిందూ షట్ దర్శనాల్లో ఒకటి. అది భగవంతుని కనుగొనే విధానం. యోగ మతాతీతం అంటున్నారు. యోగం మతాతీతమే కానీ అది హిందూధర్మంలో భాగం. దాన్ని ప్రతి హిందువు తప్పకుండా ఆచరించాలి.