సొంత గడ్డలో ఈటలకు బిగ్ షాక్! హుజూరాబాద్ లో ఏం జరుగుతోంది..?
posted on Jun 21, 2021 @ 10:10AM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కమలం నేతలతో కలిసి కేసీఆర్ టార్గెట్ గా దూకుడు పెంచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నాురు. రోజుకో రెండు, మూడు గ్రామాలు తిరుగుతూ తన మద్దతుదారులతో బలప్రదర్శన చేస్తున్నారు రాజేందర్. అటు టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ పై స్పెషల్ ఫోకస్ చేసింది. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరుగుతూ.. గులాబీ కేడర్ చేజారకుండా చూస్తున్నారు. దీంతో హుజురాబాద్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఏ లీడర్ ఎవరికి పక్షాన ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. సమీకరణలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఇవాళ ఈటలతో ఉన్నవారు.. మరుసటి రోజు టీఆర్ఎస్ సమావేశంలో ప్రత్యక్షమవుతున్నారు. కారు పార్టీలోనే ఉంటామన్న వారు తెల్లారేసరికి ఈటల క్యాంపులో కనిపిస్తున్నారు.
తాజాగా మరో కీలక పరిణామం హుజురాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు... ఆయనకు హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లే వరకు ఈటల వెంట నేతలు.. కొందరు కీలక నేతలు ఆయనతో టచ్ లోకి రావడం లేదంటున్నారు. ఈటల రాజేందర్‌కు ఆయన సన్నిహితుడు ఒకరు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరి ఈటలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఈటలకు దూరమయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల వద్దకు కూడా వెల్లకుండా తుమ్మెటి తన ఇంటికే పరిమితం అయ్యారట. నాలుగు రోజులుగా రాజేందర్ హుజురాబాద్‌లోనే ఉన్నా.. తుమ్మేటి సమ్మిరెడ్డి ఆయనను కలవలేదని చెబుతున్నారు.
ఈటలకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సమ్మిరెడ్డి సడెన్ గా సైలెంట్ కావడంపై నియోజకవర్గంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో చేరే సమయంలో బీజేపీ జాతీయ నాయకుల వద్దకు వెల్లిన ఈటల.. తన వెంట సమ్మిరెడ్డిని తీసుకెళ్లకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాషాయం కండువా కప్పుకునేందుకు జాతీయ నాయకుల వద్దకు వెళ్లే జాబితాలో సమ్మిరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్టు సమాచారం. కొవిడ్ కారణంగా ఈటల వెంట వచ్చిన వారందరినీ లోపలకు రావద్దని కేవలం 25 మంది మాత్రమే రావాలని బీజేపీ నాయకులు సూచించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఈటల బీజేపీ నాయకులకు పంపించారు. ఈ లిస్ట్‌లో తుమ్మేటి పేరు లేకపోవడం చూసి షాక్‌కు గురైన ఆయన ఢిల్లీ నుండి వచ్చిన తరువాత నేరుగా జమ్మికుంటకు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఈటలతో టచ్‌లో ఉండటం లేదని తెలుస్తోంది.
బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా హుజురాబాద్‌కు వచ్చిన ఈటలను కూడా సమ్మిరెడ్డి కలవలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సమ్మిరెడ్డి ఎందుకు రావడం లేదన్న విషయంపై ఈటల కూడా అంతగా పట్టించుకోకపోవడంతో.. ఆయన మరింతగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై సమ్మిరెడ్డి తన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నట్టుగా తెలిసింది. ఇంత జరిగినా ఈటల నుండి మాత్రం పిలుపు రాకపోవడం ఏమై ఉంటుందా అని సమ్మిరెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత నుండి మారిపోయారన్న అభిప్రాయాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈటలతో సమ్మిరెడ్డి దూరంగా ఉంటున్నారని తెలుసుకున్న గులాబీ లీడర్లు ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి కారెక్కనున్నారని సమాచారం. సమ్మిరెడ్డి బాటలోనే మరికొందరు ఈటల అనుచరులు.. టీఆర్ఎస్ ముఖ్యలతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో మరిన్ని కీలక పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.