పొలం కంచెగా బతుకమ్మ చీరలు! కేటీఆర్ ఇలాఖాలోనే! నాసిరకమే కారణమా?
posted on Oct 13, 2020 @ 4:05PM
దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తోంది. నాలుగేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం.. ఈసారి కూడా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి జరుగుతోంది. బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్.. దసరాకు ఇచ్చే కానుకగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. బతుకమ్మ చీరల పంపిణి సీఎం కేసీఆర్ కు కూడా చాలా ఇష్టమైన పథకమని చెబుతారు. అందుకే కేటీఆర్ కూడా చీరల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఏటా బతుకమ్మ చీరల డిజైన్లను పెంచుతున్నారు. ఈసారి నాలుగు వందలకు పైగా వివిధ డిజైన్లలో బతుకమ్మ చీరలను సిద్ధం చేసినట్లు చేనేత శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశామని చెప్పారు.
అయితే కేసీఆర్ సర్కార్, కారు పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న బతుకమ్మ చీరలే వారికి అప్రతిష్టను తీసుకొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. బతుకమ్మ చీరలన్ని సిరిసిల్ల జిల్లాలోనే తయారవుతున్నాయి. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేసే బతుకమ్మ చీరలు.. ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే పొలానికి కంచెగా మారడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.
మొదటి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణి సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వడంతో తీసుకోవడానికి మహిళలు ఇష్టపడ్డారు.
బతుకమ్మ చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. మహిళలను అదుపు చేసేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఊహించినట్లుగా చీరలు లేకపోవడం, నాసిరకంగా ఉండటంతో బతుకమ్మ చీరలపై మహిళల ఆసక్తి పోయినట్లు చెబుతున్నారు. అందుకే రెండో సంవత్సరం నుంచి బతుకమ్మ చీరల క్రేజీ తగ్గిపోయిందని తెలుస్తోంది. గత సంవత్సరం చాాలా బతుకమ్మ చీరలు పంచకుండా మిగిలిపోయాయని అధికారుల లెక్కల్లో తెలుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మిగిలిపోయిన చీరలు కట్టలుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈసారి అయితే పరిస్థితి మరి దారుణంగా తయారైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు తీసుకునేందుకు మహిళలు ముందుకు రాకపోవడంతో పంపిణి కేంద్రాలు వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాల్లో చీరలు తీసుకునేందుకు రావాలంటూ గల్లిగల్లీ తిరిగి అధికారులు చాటింపు వేయించారని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రండమ్మ రండి అని సిబ్బంది అరిచినా .. చీరల పంపిణి కేంద్రాల వైపు ఎవరూ రాలేదని చెబుతున్నారు. మహిళలు రాకపోవడంతో చేసేది లేక కొన్ని గ్రామాల్లో అధికారులే ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది.
బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటమే మహిళల నిరాసక్తతకు కారణమంటున్నారు.
బతుకమ్మ చీరల నాాణ్యతపై మహిళలు బహిరంగగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. చీరలు పంచేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ. ఎమ్మెల్యేలతో కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. నాసిరకం చీరలు మాకు అవసరం లేదంటూ వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తారు. మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికార పార్టీ నేతలు చీరల పంపిణికి వెళ్లడం లేదని సమాచారం. దీంతో గతంలో గ్రామాల్లో సందడిగా సాగిన బతుకమ్మ చీరల పంపిణి.. ప్రజాప్రతినిధులు రాకపోవడంతో ఈసారి అధికారులు, స్థానిక నేతలే సాదాసీదాగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణి చేస్తుందని, నాసిరకంగా ఉన్నయంటూ చీరలపై రాద్ధాంతం చేయడం సరికాదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు గులాబీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకునే, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించే బతుకమ్మ చీరలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం అధికార పార్టీకి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.