తెలంగాణలో మావోయిస్టుల అలజడి! పాత రోజులు రాబోతున్నాయా?
posted on Oct 13, 2020 @ 4:23PM
తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారా? కేసీఆర్ సర్కార్ కు, పోలీసులకు సవాల్ విసరబోతున్నారా?. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో జనాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలపై దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు, పోలీసుల హడావుడితో మావోయిస్టుల బలోపేతంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసుల కూంబింగ్ తో కొన్ని రోజులుగా ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయినా మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటం ఏజెన్సీలో అలజడి రేపుతోంది.
పోలీసుల కూంబింగ్ సాగుతుండగానే ములుగు జిల్లాలో తాజాగా మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట గోడలకు ఈ వాల్ పోస్టర్లు అంటించారు. కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని లేఖల్లో ఆరోపించారు మావోలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ . అక్రమ కేసులు పెడుతూ కేసీఆర్ ప్రజలను బలి చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు ల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకుంటె టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే పడుతుందని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనం లో పోలీసులను తిప్పడం పద్ధతి కాదని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే ఆయనకు ప్రజల చేతులో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.
మూడు రోజుల క్రితమే ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండలం భోదాపురంలో టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వర్ రావును హతమార్చారు. భీమేశ్వర్ ఇంటిపై దాడి చేసిన మావోయిస్టులు కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి ఆయనను హత్య చేశారు. టీఆర్ఎస్ నేతను హత్య చేసిన అనంతరం అక్కడ లేఖ వదలి వెళ్లారు మావోయిస్టులు. తమ ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్ నేతను చంపినా ములుగు జిల్లాలోనే తాజాగా మావోయిస్టులు మరోసారి వార్నింగ్ లేఖ వదలడం పోలీసు వర్గాలను మరింత కలవరపరుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు కనిపించింది. కేసీఆర్ సర్కార్ పాలనలో తొలి ఐదేండ్లు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదు. కాని ఇటీవల తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. మావోల పేరుతో గ్రామాల్లో వాల్ పోస్టులు, కరపత్రాలు విడుదలయ్యాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జూలై 12న ఆసీఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకు పోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలోనూ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే ఎదురు కాల్పుల సమయంలో పోలీసులకు దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు 600 మంది పోలీసు బలగాలతో తిర్యాణి అటవీ ప్రాంతాన్ని దాదాపుగా అష్టదిగ్భంధనం చేశారు.మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.
డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. జూలై , సెప్టెంబర్ లో రెండు సార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించారు డీజీపీ. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీశారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడం ఆసక్తి రేపింది. అక్టోబర్ తొలి వారంలోనూ ములుగు జిల్లా వెంకటాపురంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. సీఆర్పీఎఫ్ డీజీ ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి, తెలంగాణ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు చేపట్టనున్న వ్యూహా ప్రణాళికపై చర్చించారు. సంయుక్తంగా నక్సల్ కదలికలను నియంత్రించాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారని సమాచారం.
ఇక ఇటీవలే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుపోతున్నారనే ప్రచారం జరిగింది.గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ జరిగింది. గణపతి తర్వాత మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే డీజీపీ మహేందర్ రెడ్డి రెండు సార్లు ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడంతో గణపతి లొంగుబాటుపై చర్చేందుకే వెళ్లారని కూడా భావించారు. కాని అలాంటిదేమి జరగలేదు. గణపతి లొంగుబాటు వార్తలను ఖండిస్తూ మావోయిస్టులు లేఖను కూడా విడుదల చేశారు. గణపతి లొంగుబోతున్నారని ప్రభుత్వమే కట్టుకథ అల్లిందని అందులో ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేతలెవరు లొంగిపోయే పరిస్థితి లేదని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు.
పోలీసుల కూంబింగ్, డీజీపీ పర్యటన తర్వాత మావోయిస్టులు మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. నెల రోజులుగా ఎక్కడో ఓ చోట మావోయిస్టుల కదలికలకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. తెలంగాణ బార్డర్ లో మావోల కదలికలు పెరిగాయని కేంద్ర ఇంటలిజెన్స కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ నుంచి భారీగా మావోియిస్టులు తెలంగాణకు వచ్చారని అలర్ట్ చేసిందని తెలుస్తోంది. ఇటీవలే మావోయిస్తులు గుంపులు గుంపులుగా తెలంగాణ వైపు వస్తున్నట్లుగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. ఏజెన్సీలో పోలీసులు అమర్చిన నిఘా కెమెరాల్లో మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం దిశగా వస్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. పోలీసులే ఆ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మావోయిస్టుల గుంపు భారీగా ఉండటం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేసిందని చెబుతున్నారు.
వందలాది మంది పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ములుగు జిల్లాలో జరుగుతున్న మావోయిస్టుల వరుస చర్యలతో ఏజెన్సీలో భయాందోళన నెలకొంది. భీమేశ్వరరావు హత్యతో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు భయంభయంగా బతుకున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న పార్టీల కార్యకర్తలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో గడుపుతున్నారట. మొత్తంగా ఏజెన్సీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో మళ్లీ పాత రోజులు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయని గిరిజనులు, ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల కవాతులు, బుల్లెట్ల శబ్దాలు మళ్లీ వినాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.