ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ...!
posted on Oct 5, 2020 @ 6:04PM
ఏపీ సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. అయన ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలవనున్న నేపథ్యంలో, మరోపక్క కేంద్ర కేబినెట్ లో చేరాలని జగన్ కు ఆహ్వానం అందిందని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యనటకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీకి 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కూడా మిత్రపక్షాల అవసరం చాలా ఉంది. కొద్దీ రోజుల క్రితం ఎన్డీయే నుండి అకాలీదళ్ బయటకు వెళ్లిపోవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం తగ్గింది. దీంతో లోక్ సభలో బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా... రాజ్యసభలో మాత్రం బిల్లులను పాస్ చేయించుకోవడానికి ఇతర పార్టీల అవసరం చాలా ఉంది.
ఈ నేపథ్యంలో వైసీపీకి ఒకటి రెండు బెర్తులిచ్చి కూటమిలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసిపి కొన్ని బిల్లులకు తన పూర్తీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రధాని మోడీతోనూ, అలాగే బీజేపీ పెద్దలతోను జగన్ ఈరోజు, రేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అయితే కేంద్ర కేబినెట్ లో చేరితే వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న క్రిస్టియన్లు, మైనారిటీలు పార్టీకి దూరమవుతారని అయన సందేహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలు మళ్ళీ ప్రత్యేక హోదా స్లోగన్ ఎత్తుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు రాజకీయంగా సీఎం జగన్ కు ఇబ్బందికరమైనవే. ఇప్పటికే వైసీపీ పార్లమెంట్ లో బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కేంద్ర కేబినెట్ లో చేరడానికి అంగీకరిస్తారా.. లేక బయటి నుండి మద్దతు ఇస్తాం అని అంటారా.. ఏ విషయం రేపటిలోగా తేలనుంది.