ఈ తరం గాంధీ 'విష్ణువర్ధన్ రెడ్డి'కి 13 జిల్లాల్లో అభిమానులు!!
posted on Oct 5, 2020 @ 4:36PM
పేదల పెన్నిది..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి..
13 జిల్లాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్న మన ప్రియతమ నేత..
ఆంధ్రా ముద్దుబిడ్డ విష్ణువర్ధన్ రెడ్డికి కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు...
ఏపీలోని పదమూడు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఉందో లేదో తెలియదు గానీ.. ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం పదమూడు జిల్లాల్లోనూ ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ మాట మేం అనట్లేదు. స్వయంగా ఆయనే చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా 13 జిల్లాల్లోని ఆయన అభిమానులు రక్తదాన శిబిరాల ఏర్పాటు, సేవా కార్యక్రమాలు చేసి.. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఊరుకోండి.. సీఎం స్థాయి నేతలకే 13 జిల్లాల్లో క్రేజ్ లేదు, ఈయనకి ఎలా ఉంటదని తక్కువ అంచనా వేయకండి. అసలు అధికార పార్టీ వాళ్ళు తమ నేతని ఈ తరం గాంధీ అని చెప్పుకుంటున్నారు గానీ.. నిజానికి ఈ తరం గాంధీ విష్ణువర్ధన్ రెడ్డి. అందుకేనేమో ఆయన గాంధీ జయంతి నాడు జన్మించారు. మరి గాంధీ జయంతి నాడు పుట్టిన ఈ తరం గాంధీ జన్మదినం అంటే ఆ మాత్రం హడావుడి లేకుండా ఎలా ఉంటుంది. అందుకే 13 జిల్లాలోనూ ఆయన అభిమానులు సేవాకార్యక్రమాలు చేశారు. వాటిని వీడియో రూపంలో విష్ణువర్ధన్ రెడ్డి మనతో పంచుకున్నారు.
ఏంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఇంత క్రేజ్ ఉందా!!.. అలా అయితే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో 13 జిల్లాల్లో క్రేజ్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని సీఎం అభ్యర్దిగా ప్రకటిస్తే బాగుంటుంది. ఆయన క్రేజ్ తో ఖచ్చితంగా నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని బీజీపీ పెద్దలకి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?. ఆగండి ఆగండి అక్కడే మనమంతా పప్పులో కాలేశాం. నాణేనికి మరోవైపు కథ వేరే ఉంది. అసలు మేటర్ ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను అదేరోజు పుట్టినరోజు జరుపుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, అనంతపూర్ రాయల్ యూత్ ఫెడరేషన్ మరియు నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మరియు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛందంగా కొందరు యువకులు రక్తదానం చేశారు.
అయితే రాజమహేంద్రవరం, అనంతపూర్ లో జరిగిన కార్యక్రమాలకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి వాడేసుకున్నారు. ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలన్ని తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినవే అంటూ విష్ణువర్ధన్ రెడ్డి నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీంతో ఇదేం పబ్లిసిటి పిచ్చి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై సెటైర్లు వినిపిస్తున్నాయి.
విష్ణువర్ధన్ రెడ్డికి మొదటి నుంచి ప్రచార పిచ్చి ఎక్కువనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. మీడియాలో ఫోకస్ అయ్యేందుకే ఆయన కావాలనే కాంట్రవర్సీ కామెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, పొలిటికల్ టీడర్లకు పబ్లిసిటి పిచ్చి ఉండవచ్చు కాని.. ఇంత పీక్ స్టేజీలో ఉండకూడదని అంటున్నారు. పబ్లిసిటి కోసం ఏకంగా గాంధీ జయంతి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై ఏపీ బీజేపీలోనూ పెద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఛీప్ ట్రిక్స్ తో పార్టీ పరువు పోతుందని కొందరు కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను.. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు జరిపారని చెప్పుకోవడం ఏంటని విష్ణువర్ధన్ రెడ్డిపై కమలం ముఖ్య నేతలు ఫైరయ్యారని సమాచారం.