Read more!

చేవెళ్ల లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ, కాంగ్రెస్‌ బలహీనతలు ఏంటి?

ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.  చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా  మూడు ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటి? బ‌ల‌హీన‌త‌లు ఏమిటో చూద్దాం. 

చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. 

బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిః
2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై, బీఆరెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు. 
ఓడిపోయిన  విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.  విశ్వేశ్వరెడ్డి గెలుపుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి సానుకూలంగా మారింది. గతంలో ఆయన ఎంపీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. స్థానికంగానే బసచేస్తూ క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.  మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడితే ఇక్క‌డ బీజేపీ ఈజీగా గెలిచేది. కానీ ఎంఐఎం త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. కాబ‌ట్టి పోటీ  కాంగ్రెస్ బీఆర్ ఎస్ మ‌ధ్య ముఖాముఖి పోటీ వుంది. బీఆర్ ఎస్ పార్టీకే ఇక్క‌డ క‌లిసి వ‌చ్చే అవకాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిః
చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.  చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఎదురీదుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తరలివస్తారని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో చేరికలు జరడంగలేదు. దీంతో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవడంలేదు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించినా తరువాత ఆయన వెనక్కి తగ్గారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయన వెనక్కి తగ్గి బీఆర్ ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం అభాసుపాలైంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విష‌యంలోనూ ఓట‌ర్ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు.
 
బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ః
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గ‌డ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజ‌కీయంగా అనుభ‌వం లేని నేత‌ల‌ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు గులాబీబాస్‌. ప్ర‌స్తుత బీఆరెస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్థానికుడు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు.  ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ జ‌నాభా కూడా 50 శాతానికి మించి వుంది. ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కాసాని గెలిచిన‌ట్లేన‌ని స్థానిక ఓట‌ర్లు  చెప్పుకుంటున్నారు.  ఇక్క‌డ బీఆర్ఎస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ వుంది కాబ‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బీఆర్ ఎస్ చేవెళ్ళ‌లో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని గులాబీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది.  స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. పైగా బీసీలంతా కాసానికే అండ‌గా వున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు గెలుపుకోసం బీఆర్ ఎస్‌ అనుబంధ సంస్థలు, బీసీ కుల‌సంఘాలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్‌  అభ్యర్ధి గా వుండ‌టం బీఆర్ ఎస్‌కు సానుకూలంగా మారింది. గతంలో ఆయన జ‌డ్పీ ఛైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. కేసీఆర్ పాల‌నే  ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు. మరో వైపు  బీఆర్ ఎస్ సోషల్‌ మీడియా వింగ్‌ కూడా తెర వెనుక విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ ఎస్‌ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తూ కాసాని ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పట్టునిలుపుకునేయత్నం చేస్తోంది.  బీసీ కార్డును ప్రయోగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి రోజు వారీ నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యత సబితారెడ్డి తీసుకున్నారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌