పిన్నెల్లికి ముందస్తు బెయిలుపై సుప్రీంకు వెళతారా?

ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు  ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు. హౌస్ అరెస్టులో ఉండగా తప్పించుకు పారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ఏపీ పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మరీ ఆయన కోసం హైదరాబాద్ వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చంద్రంగా ఆయన కారును, అందులోని ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాత్రం తప్పించుకున్నారని చెప్పారు. ఆ తరువాత కూడా అరెస్టు చేస్తామంటూ గంభీర ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ, ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఈ లోగా నరసరావు పేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతున్నారంటూ వార్తలు. మన పోలీసులేమో పెద్ద సంఖ్యలో కోర్టు వద్ద మోహరింపు. ఈ లోగా పిన్నెల్లి  ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిలు పొందడం జరిగిపోయాయి. జగనన్న దృష్టిలో చాలా మంచోడు అయిన పిన్నెల్లిపై జూన్ 5వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.  

ఇలాంటి మంచోల్లు వైసీపీలో చాలా మంది ఉన్నారు. అంతా తామే చేసి.. ఎదుటివారిపై నెపం నెట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వారి కోవలోకే మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి వచ్చి చేరారు. అతి మంచివాడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పెలా అవుతుందని అమాయకంగా ప్రశ్నిస్తూ, ఈవీఎం ధ్వంసం చేస్తేనేం.. అందులో డేటా భద్రంగా ఉందిగా అంటూ ఓ లాజిక్ ను కూడా తెరమీదకు తెచ్చారు. డేటా భ్రదంగా ఉన్నప్పుడు విలవ లేని ఈవీఎంను ధ్వంసం చేస్తే తప్పేమిటని సమర్ధించారు. 

వైసీపీ వాళ్ల సమర్ధింపులు అన్నీ పక్కన పెడితే.. ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని నిలువరించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు పిన్నెల్లి విషయంలో ఏం చేస్తారు? ఏం చేయగలరు? కనీసం ఆనవాయితీ ప్రకారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయిస్తారా?  అందరి మనస్సుల్లోనూ తలెత్తుతున్న అనుమానాలు, సందేహాలు ఇవే.

పిన్నెల్లికి జూన్ 5 వరకూ ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం సహజం. విధాయకం కూడా. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ చేసిన పని ఇదే.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రఘురామకృష్ణంరాజు కేసులతోపాటు.. రాజధాని కేసులు, సీఐడీ కేసుల్లో హైకోర్టులో దెబ్బతిన్న ప్రతిసారీ జగన్ సర్కార్ సుప్రీం తలుపు తట్టింది.  అంతెందుకు  సీనియర్ ఐపిఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై విధించిన సస్పెన్షన్ చెల్లదు  తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశంపై కూడా హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఒకసారి హైకోర్టు, ఇంకోసారి సుప్రీంకోర్టు కూడా ఏబీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి.  ఇప్పుడు సీఎస్ జవహర్‌రెడ్డి..సీఈసీ చెప్పినట్లు, ఈవీఎం పగులకొట్టి సిగ్గుమాలిన పనిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి.. బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా?  లేదా జగన్ పై భక్తిని చాటుకుంటూ ఆయనే మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారు కదా.. ఇక సుప్రీంకు ఎందుకులే అని ఊరుకుంటారా చూడాలి. 

Teluguone gnews banner