కరోనా దెబ్బకి ఖాళీ అవుతున్న సిటీలు.. విలేజ్ లలో కొత్త ట్రెండ్ షురూ!!
posted on Jun 1, 2020 @ 2:08PM
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం చాలా మారిపోతుంది. కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కరోనా దెబ్బకి అనేక కంపెనీల తీరు మారనుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల తీరు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇకనుంచి మెజారిటీ ఐటీ కంపెనీలు 'వర్క్ ఫ్రమ్ హోమ్' కి మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు.. కరోనా దెబ్బకి ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇదే భవిష్యత్ లోనూ కొనసాగే అవకాశముంది. ఉద్యోగులు కూడా 'వర్క్ ఫ్రమ్ హోమ్' కే ఓటేస్తున్నారు.
అటు కంపెనీ యాజమాన్యాలు, ఇటు ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' కి సై అనడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరోగ్యం, రెండు డబ్బు. కరోనా దెబ్బకి శుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ద అందరిలోనూ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వందల మందితో కలిసి పనిచేయడం ఉద్యోగుల ఆరోగ్యానికి రిస్క్. అది కంపెనీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితిల్లో ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా.. 'వర్క్ ఫ్రమ్ హోమ్' సరైన నిర్ణయం. దీనివల్ల బోలెడంత డబ్బు కూడా సేవ్ అవుతుంది. చాలా కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్ లు తీసుకొని లక్షల్లో రెంట్ పే చేస్తున్నాయి. 'వర్క్ ఫ్రమ్ హోమ్' తో.. కంపెనీలు చిన్న బిల్డింగ్ లకు మారిపోతాయి కాబట్టి బోలెడంత డబ్బు సేవ్ అవుతుంది.
'వర్క్ ఫ్రమ్ హోమ్' వల్ల ఉద్యోగుల డబ్బులు కూడా సేవ్ అవుతాయి. అనేకమంది స్వస్థలాలను వదిలి.. ఆఫీస్ ల కోసం మెట్రో నగరాల్లో ఉంటూ.. వేలల్లో రెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు 'వర్క్ ఫ్రమ్ హోమ్' తో చాలామంది స్వస్థలాలకు వెళ్ళిపోయి.. వర్క్ చేస్తున్నారు. దానివల్ల రెంట్ ఉండదు. ట్రావెలింగ్ ఖర్చు కూడా ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా పొల్యూషన్ కి దూరమవుతారు. మెట్రో సిటీలలో.. ట్రాఫిక్, పొల్యూషన్ చాలా ఎక్కువ. ట్రాఫిక్ తో టైం వేస్ట్ అవుతుంది. పొల్యూషన్ తో హెల్త్ పాడవుతుంది. అందుకే చాలామంది ఆలోచనలు మారిపోయాయి. 'వర్క్ ఫ్రమ్ హోమ్' తో ప్రశాంతంగా విలేజ్ లకు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ ట్రెండ్ మొదలైంది. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి పెద్ద సిటీలను వదిలి.. ట్రాఫిక్, పొల్యూషన్ లేని చిన్న చిన్న నగరాలకు వెళ్లి వర్క్ చేసుకుంటున్నారు. ఇదే ట్రెండ్ భారత్ లోకీ వచ్చే అవకాశముంది. విలేజ్ లో ఉండి 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేస్తే శాలరీకి శాలరీ వస్తుంది. హెల్త్ కాపాడుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా స్వస్థలంలో సంతోషంగా ఉండొచ్చు.
కంపెనీలు కూడా ఇక ఉద్యోగుల టాలెంట్ కి మాత్రమే పెద్ద పీట వేయనున్నాయి. ఉద్యోగుల లుక్ ఎలా ఉంది? వాళ్ల లొకేషన్ ఏంటి? అనేవి ముఖ్యం కాదు. ఎక్కడున్నా కరెక్ట్ గా వర్క్ చేస్తే చాలు. ఉద్యోగులకు ఉన్న టాలెంట్, వాళ్ళు చేస్తున్న వర్క్ ని మాత్రమే పరిగణలోకి వస్తున్నాయి. అంటే, ఉద్యోగులు కనిపించరు.. వాళ్ల పని మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. అలాగే, ఉద్యోగుల ఎంపిక కూడా ఆన్ లైన్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలెంట్ ఉంటే చాలు.. ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూ ఇవ్వొచ్చు, ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. ఇదే జరిగితే చాలా మార్పులు జరుగుతాయి. మెట్రో సిటీలు చాలావరకు ఖాళీ అవుతాయి. ట్రాఫిక్, పొల్యూషన్ తగ్గుతాయి. చూస్తుంటే మార్పు మంచిదే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.