కేసీఆర్ యుద్ధం ఎవరి పైన? టార్గెట్ ఎవరు?
posted on Nov 17, 2021 @ 9:43AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి మాటల తూటాలు పేల్చారు. మరోసారి కడుపులో ఉన్న ఆవేదన, ఆందోళన, ఆగ్రహం మొత్తం ఒక్కసారిగా బయట పెట్టారు. కత్తులు దుశారు, కేంద్రం పై యుద్ధాన్ని ప్రకటించారు.సమస్య పాతదే.. వరి వివాదం. ప్రశ్నలు పాతవే, తెలంగాణలో పండిన వరి కొంటారో లేదో చెప్పాలని సూటి ప్రశ్నను కేంద్రంపై సంధించారు. రెండు రోజుల డెడ్ లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత నవంబర్ 18 మహా ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. మహా ధర్నాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారో లేదో ఆయన చెప్పలేదు కానీ, మంత్రి వర్గం మొత్తంగా ధర్నాలో కూర్చుంటుందని చెప్పారు. అలాగే, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు మొదలు క్రింది స్థాయి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ‘ఇందిరాపార్క్’ ధర్నాలో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ పై జిల్లాలలో జరుగతున్న భౌతిక దాడులను సమర్ధించుకున్నారు. బండి ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ తెరాస రైతులు ఆయన్ని నిలదీస్తారని స్పష్టం చేశారు. ఒక విధంగా నిలదీయాలని దాడులు కొనసాగించాలని తెరాస రైతులకు/శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆలాగే, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నిటికంటే ముఖ్యంగా, ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎపిసోడ్స్’లో గానీ, ఈ తాజా ఎపిసోడ్’లో కానీ బీజేపే అధ్యక్షుడు బండి సంజయ్’ని టార్గెట్ చేశారు. యాసంగిలోనూ వరి వేయాలని బండి ఇచ్చిన పిలుపు, రాష్ట్ర్ర ప్రభుత్వం కొనకపోతే మెడలు వంచికొనిపిస్తామని ఆయన చేసిన వ్యాఖ్య చుట్టూనే, ముఖ్యమంత్రి ఆగ్రహం బుసలు కొడుతోంది.
అయితే, ముఖ్యమంత్రి ఈ స్థాయిలో బండిని టార్గెట్ చేయడం వరి’ కోసమేనా? ఇంకా ఏదైనా అంతర్ వ్యూహం, సీక్రెట్ స్క్రిప్ట్ ఉందా? అంటే ముఖ్యమంత్రి బండి బుజాన తుపాకి పెట్టి ఒకటి కంటే,ఎక్కువ తూటాలనే (వ్యూహలనే) ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు.
నిజానికి ధాన్యం సమస్య కేవలం ఒక్క తెలంగాణకు మాత్రేమ సంబందించిన సమస్యకాదు,వరి పండించే అన్ని రాష్ట్రాలకు, ఆమాట కొస్తే దేశం మొత్తానికి సంబందించిన సమస్య. ఒకటి రెండు కాదు, ఏడేళ్లకు సరిపడా ధాన్యం బఫర్ స్టాక్ నిల్వలు గోడౌన్లలో పడి మగ్గుతున్నాయి. ఈ పరిస్థితిలో అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ, సమస్యను జటిలం చేయడం సరి కాదు, సమంజసం కాదు. సమాఖ్య స్పూర్తితో సమస్యను పరిష్కరించుకునే ప్రభుత్వాల స్థాయిలో ప్రయత్నం జరిగితేనే సమస్య ఎంతో కొంత పరిష్కారం అవుతుంది. అంతే కానీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రోడ్డు ఎక్కి, ధర్నాలు, మహా ధర్నాలు చేస్తే సమస్య రాజకీయం అవుతుందే కానీ పరిష్కారం కాదని, వ్యవసాయ,ఆర్థిక రంగాల నిపుణులు అంటున్నారు.
సరే, అదలా ఉంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఆగ్రహం, ఆవేదనల విషయానికి వస్తే, హుజూరాబాద్’ ఉప ఎన్నిక ఓటమి ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూల కారణం అని వేరే చెప్పనక్కరలేదు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి వరి వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.అలా హుజూరాబాద్ ఓటమి ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూలా కారణం అయితే, ఆ ఎన్నికల్లో ‘ఈటల రాజేందర్’ గెలిచి రావడం మరో ముఖ్య కారణం. ఈటల గెలుపు కేసీఆర్ ‘దొరహంకారాన్ని’ భయంకరంగా హర్ట్ చేసిందని, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల సమాచారంగా, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి బీజేపీలో ఈటల ఎదుగుదలను అడ్డుకునేందుకు, ఆయన తనకు ప్రత్యర్ధిగా ఎదగకుండా అడ్డుకునేందుకు, హుజురాబాద్ ఓటమిని అక్కడికే పరిమితం చేసేందుకు వ్యూహాత్మకంగా బండిని టార్గెట్ చేసి, పరోక్షంగా ఆయన్ని హీరో చేసేందుకు సహకరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఈటలకు చెక్ పెట్టాలనే ఆలోచన వెనక మరో వ్యూహం కూడా ఉందని అంటున్నారు. బీసీ ముదిరాజ్, క్యాస్ట్ ఓటును కాపాడుకోవాలన్నా, బీజేపీలో ఈటల ఎదగకుండా చేయడం అవసరంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఈటలను రీప్లేస్ చేసేందుకు అదే ముదిరాజ్ కులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్’కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటున్నారు. బండా ప్రకాష్’ మంత్రి వర్గంలోకి తీసుకోవడం కూడా ఖాయమని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఈ స్థాయిలో స్కెచ్ గీసి ఎపిసోడ్ వైజ్’ గా ‘వరి’ సీరియల్ రక్తి కట్టించడం వెనక ఇదొక్కటే కారణమా అంటే కాదు, ఇదికూడా ఒక కారణం, అంటున్నారు విశ్లేషకులు.
నిజానికి చుట్టుముడుతున్న కుటుంబ కలహాలు, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాటు భయాలు, దళిత బంధు ఊబిలోంచి తప్పించుకునే ఎత్తుగడ, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం, కేసుల భయం ఇలా చాలా చాలా ఉపద్రవాలకు ముఖ్యమంత్రి ఎంచుకున్న సర్వరోగ నివారిణి, వరి వివాదం ... కేంద్రం పై యుద్ధం, అనే విశ్లేషణలు కూడా వినవస్తున్నాయి. అయితే, ఎంత కేసీఆరే అయినా, అన్ని సందర్భాలలో అందరినీ మోసం చేయడం అయ్యే పని కాదు. అంతే కాదు, రాష్ట్రంలో తెరాస కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు, బండిని. బీజేపీ ని టార్గెట్ చేసినా అది చివరకు తెరాసకు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ బలపడి పది సీట్లు గెలుచుకుంటే, అది తెరాసకు అదనపు బలం, యాడెడ్ స్త్రెంత్ అవుతుంది. కానీ, ఆ పది సీట్లు బీజేపీకి దక్కితే, ఒక్కరూ తెరాస కారెక్కరు. సో ... బీజేపీని పెంచడం అంటే పాముకు పలు పోసినట్లే నని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.