ఎంపీ అరెస్టుకు అసలు కారణం ఇదే..
posted on May 15, 2021 @ 9:37AM
“ఆంధ్ర ప్రదేశ్’లో అరాచక, అవినీతి పాలన సాగుతోంది” నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు, సంవత్సర కాలానికి పైగా రచ్చబండ సాక్షిగా ప్రతి రోజు చేస్తున్న ఆరోపణ ఇది. విషయం మారుతూ ఉండచ్చు, ఒకసారి దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వసం విషయం కావచ్చు మరోమారు అమరావతి రైతులకు జరిగిన అన్యాయం విషయమే కావచ్చు, లేదంటే ఇసుక, మద్యం పాలసీల విషయంలో కావచ్చు, విషయం ఏదైనా సారాంశం మాత్రం అదే. నిజానికి రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అయన మాత్రమే చేసినవి కాదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మీడియా, మేధావులు, విశ్లేషకులు, సామాన్య ప్రజలు అందరూ చేస్తున్నవే. అది సహజం. అయితే రఘురామ కృష్ణం రాజు ప్రతి పక్ష ఎంపీ కాదు. అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుడు. అధికార పార్టీ సభ్యుడై ఉండి, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రతి రోజు రచ్చబండకు ఉతికి ఆరేయడం అధికార పార్టీ పెద్దలకు రుచించక పోవచ్చును.
ఇంతకాలం ఆయన చేసిన, చేస్తున్న ఆరోపణలపై చట్టపరంగానే కాదు, రాజకీయంగా క్రమ శిక్షణా చర్యలు అయినా తీసుకోని, ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఆయనను, అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదే విధంగా ఎంపీ అరెస్ట్’కు ఎంచుకున్న సమయం, పెట్టిన కేసులు ( ఐపీసీ 124 ఎ (రాజద్రోహం) 153ఎ (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చ కొట్టడం), 505 (ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం), అరెస్ట్ సందర్భంగా సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు గమనిస్తే, ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. అలాగే,కృష్ణంరాజు చేసిన, ‘రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన జరుగుతోందన్న’ ఆరోపణలను నిజం చేసే విధంగా ఉన్నాయని పరిశీలకులు, చివరకు ఎంపీ విధానాలతో విబేధించే రాజకీయ పార్టీలు నాయకులు సైతం అంగీకరిస్తున్నారు.
కృష్ణం రాజు అరెస్టు కు ఆయన పుట్టిన రోజును ఎంచుకోవడం మొదలు, అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించడం,ఆయనపై బెయిల్ కు అవకాశం లేని దేశ ద్రోహం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేయడం అన్నీ కూడా ఒక పధకం ప్రకారం సాగించిన కక్ష సాధింపు చర్య అన్న ఆరోపణలకు బలం చేకురుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రఘురామకృష్ణంరాజుకు ఎంపీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ అనుమతి ఉండాలని చెప్పినా అవన్నీ కోర్టులో చూసుకోండి అంటూ దౌర్జన్యంగా అరెస్టు చేశారని ఆయన కుమారుడు భరత్ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రిని కోవిద్-19 నిబంధనలు కూడా పాటించకుండా 35 మంది సిఐడి పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేశారని భరత్ మీడియాకు వివరించారు.
కృష్ణంరాజు అరెస్ట్’కు ఆయన ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు కారణమా , అంటే కాదు, అదొక సాకు మాత్రమే, అనేది అందరి అభిప్రాయంగా వుంది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘ఏ వన్’ ముద్దాయిగా విచారణ ఎదుర్కుంటున్న క్విట్ ప్రో కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, కృష్ణం రాజు ఇటీవల పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానం కృష్ణం రాజుపిటీషన్ను విచారణకు స్వీకరించింది. బెయిలు నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తున్నారని, అదే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసు సర్వ్ చేసింది. ఈ నేపధ్యంలోనే వైసీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా కేసులు నమోదు చేసి, ఎంపీని అరెస్ట్ చేసందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
మరో వంక కృష్ణం రాజు అరెస్ట్’ను రాజకీయాలకు అతీతంగా వైసీపీ యేతర పార్టీలు, నాయకులు తప్పు పడుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ప్రజాసమస్యలపై సొంత పార్టీ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంతో సమానమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని అన్నారు.అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్, నియంత కంటే ఘోరంగా, ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని ఘాటుగా స్పందించారు.అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సొంత పార్టీ ఎంపీ అరెస్ట్’కు ఇదా సమయం అని ప్రభుతాన్ని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విభృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించాల్సి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కొంతకాలం పాటైనా రాజకీయ దమన నీతిని కట్టిపెట్టాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రఘురామ కృష్టంరాజును అరెస్ట్ ను ఖండించారు. ఎంపీ రఘురామ కృష్టంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బండి సంజయ్ అన్నారు. ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులోకి తోస్తారా..? అంటూ నిప్పులు చెరిగారు. ‘‘లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్ట్టారు.అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం అరెస్టును సమర్దించే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రులు, పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇలాంటి చర్యల వలన ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే సంకేతాలు వెళతాయని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూరుతుందని, అదే విధంగా ముఖ్యమంత్రి ఇంకేదో భయం వెంటాడుతోందని, అందుకే అరెస్తులతో ప్రశ్నించే గొంతులను నొక్కెసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు భావించే ప్రమాదం ఉందని కొందరు అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.