న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారా?
posted on May 15, 2021 @ 9:37AM
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు ఏపీలో రాజకీయ ప్రపంకనలు రేపుతోంది. పార్టీలకతీతంగా విపక్ష నేతలంతా రఘురామ కృష్ణం రాజు అరెస్టును ఖండిస్తున్నారు. పుట్టినరోజునే కక్ష పూరితంగా ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్ఠకు చేరింది.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వ పరువుకు భంగం కలిగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు... ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రఘురామ కృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్ణకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అసహనానికి ఎంపీ అరెస్టు నిదర్శనమని మండిపడ్డారు.
ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.