తెలంగాణ రాజకీయాల్లో ఎవరిది పైచేయి ?
posted on Apr 15, 2023 @ 3:39PM
తెలంగాణ రాజకీయాలలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీదే టాప్ పొజిషన్. ఫస్ట్ ప్లేస్. అందులో అనుమానం లేదు. అయితే, ముందున్న తిరుగులేని ఆధిక్యత అయితే ఇప్పుడు లేదు. అది కూడా అంతే నిజం. మూడు ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ కు కొంత ఎడ్జి మాత్రమే ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు ఇదే పరిస్థితి, అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా, అంటే, అవునని చెప్పడం సాహసమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. రానున్న ఐదారు నెలల కాలంలో రాష్ట్రంలో దేశంలో చోటుచేసుకునే పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎంతో కొంత ప్రభావం తప్పక చూపుతాయనీ, ఆ ప్రభావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదనీ, మారుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే, ఈ ఐదారు నెలల కాలమే కీలకమని అంటున్నారు.
నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితితో పోల్చుకుంటే, అధికార బీఆర్ఎస్ అంత పటిష్టంగా లేదు. ఒక్క ఆర్థిక పరిస్థితి మినహా ఎన్నికల విజయానికి అవసరమైన మరే ఇతర ఫాక్టర్ లోనూ బీఆర్ఎస్ ముందున్నంత పటిష్టంగా లేదు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)కు కలిసొచ్చిన సెంటిమెంట్, ఇప్పుడు ఇసుమంతైనా లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో ప్రవేశం కోసం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ సెంటిమెంట్ బీఆరేస్ వ్యతిరేక సెంటిమెంట్ గా మారుతోందని అంటున్నారు.
అలాగే ప్రభుత్వ వ్యతిరేకత విషయాన్నే తీసుకుంటే 2018లో ఫిఫ్టీ 50 పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పడు, ఫిఫ్టీ పెర్సెంట్ గీత దాటేసిందని అంటున్నారు. మరోవంక పార్టీలో పైకి కనిపించే విభేదాలు కొన్నయితే, కనిపించని విభేదాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, ఇతరత్రా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న విభేదాలు ఎన్నికల సమయానికి ఒక్కొక్కటికీ బయటకు వచ్చి భగ్గుమన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, పార్టీ అంతర్గత విభేదాలు ఎన్నికల సమయానికి పార్టీ నాయకత్వానికి సవాలుగా మారే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పార్టీ అంతర్గత వ్యవహరాల పై అవగాహన ఉన్న పార్టీ పెద్దలు చెపుతున్న మాటగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహరంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే భయం బీఆర్ఎస్ నాయకులూ వ్యక్త పరుస్తున్నారు. మరో వంక సస్పెన్షన్ కు తిరుగుబాటు వంటి అనేక పరిణామాలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎటు వెళతారు, ఏ పార్టీలో చేరతారు అనే విషయం చుట్టూనే తిరుగుతున్నా, ఆ ఇద్దరే కాకుండా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కొందరు కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా నిన్న మొన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదలు అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమని బావిస్తున్న నేపధ్యంలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.అదే జరిగితే, బీఆర్ఎస్’ హ్యాట్రిక్’ అనుమానమే అంటున్నారు.