వివేకా హత్య కేసు దర్యాప్తు.. తదుపరి అరెస్టు అవినాష్ దేనా?
posted on Apr 15, 2023 @ 4:12PM
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందు ముందు మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ శుక్రవారం (ఏప్రిల్ 14) అరెస్టు చేసిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టును సీబీఐ శనివారం (ఏప్రిల్ 15) కోర్టుకు సమర్పించింది.
ఆ రిమాండ్ రిపోర్టులో కూడా వైసీపీ ఎంపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. హత్య అనంతరం వేకువ జామున ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది.
హత్య విషయం తెలిసిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ పూర్కొంది. ఈ నలుగురికి సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది.
నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను మాయం చేసేయత్నం చేశారనీ, . అలాగే వివేకా గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆ నివేదికలో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఉదయ్ కుమార్ రెడ్డి పరారి అవుతాడన్న అనుమానంతోనే అరెస్టు చేశామని తెలిపింది. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనీ హత్య జరిగిన అనంతరం ఆయన లొకేషన్ వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా ఉదయ్ కుమార్ రెడ్డి నోరు మెదపడంలేదనీ పేర్కొంది. వివేకా హత్య కేసుకు సంబంధించి త్వరలోనే మరి కొందరు కీలక వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు సీబీఐ కోర్టులు నివేదించింది. దీంతో తరువాత అరెస్టు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. సీబీఐ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇహనో ఇప్పుడో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించిన వివరాలు స్పష్టంగా, సూటిగా హత్య జరిగిన తరువాత ఎవరెవరు ఏం చేశారన్నది వివరంగా ఉండటంతో వివేకా హత్య కేసులో తదుపరి అరెస్టు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలేనని పలువురు అంటున్నారు.
గతంలో కూడా సీబీఐ హైకోర్టుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలిపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో సీబీఐ విచారణాధికార మారడంతో సీబీఐ దర్యాప్తు ఒకింత మందగించినట్లు అనిపించింది. ఇంతలోనే ఉరుములేని పిడుగులా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ అవినాష్ అరెస్టు ఎప్పుడున్న దానిపై కేంద్రీకృతమై ఉంది. ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ వివేకా హత్య తదననంతరం అవినాష్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సాక్ష్యాల మాయంకు ప్రయత్నించారని పేర్కొనడంతో ఆయన అరెస్టు కూడా అనివార్యమని భావిస్తున్నారు.