సద్దాం హుస్సేన్‌కు బాగ్దాదీకి లింకేమిటి? అసలు ఐసిస్ ఛీఫ్‌ను పట్టించిందెవరు?
posted on Oct 29, 2019 @ 12:16PM
వేలాది మంది నరమేధం... ఆత్మాహుతి ఉగ్రదాడులు దాడులు... మహిళల అమ్మకం-విచ్చలవిడి శృంగారం... గతంలో ఏ ఉగ్ర సంస్థా చేయని విధంగా అత్యంత క్రూరత్వాన్ని చూపించిన ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ... ఇరాక్ లోని సమర్రా ప్రాంతంలో 1971న జన్మించాడు. తండ్రి షేక్ అవాద్... ఇస్లామిక్ ధర్మ బోధకుడు. బాగ్దాద్ యూనివర్శిటీలో చేరి వైజ్ఞానిక, భాషా శాస్త్రాలు అభ్యసించాడు. అలాగే, ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. అయితే, బాగ్దాదీకి సైన్యంలో చేరాలని ఆశ ఉన్నా... అతని కంటి సమస్య కారణంగా అది సాధ్యంకాలేదు. విద్యార్ధి దశలో ఒంటరితనాన్ని ఎక్కువ ఇష్టపడే బాగ్దాదీ... హింస అంటేనే ఏవగించుకునేవాడట.
అయితే, ఇరాక్ పై 2003లో అమెరికా దాడి చేయడం... సద్దా హుస్సేన్ ను పదవీచ్యుతుడిని చేయడం... 2006 తర్వాత సద్దాంను ఉరితీయడం లాంటి సంఘటనలు బాగ్దాదీ ఆలోచనల్లో మార్పు తెచ్చాయని అంటారు. సద్దాం శకం ముగుస్తున్న సమయంలో బాగ్దాదీ... షరియా మండలి పెద్దగా ఉండేవాడు. అయితే, ఈ షరియా మండలి... జమాత్ జైష్ అహిల్ ఎల్ సున్నీ పేరుతో ఉగ్ర సంస్థను నడిపేది. ఈ సంస్థను 2006లో ముజాహిద్దీన్ సురా మండలిలో విలీనం చేసిన బాగ్దాదీ... ఆ తర్వాత ఆ మండలి అధ్యక్షునిగానూ... అనంతరం ఖలీఫాగానూ అవతరించి... తానే ఇస్లామ్ కు పెద్ద దిక్కు అంటూ ప్రకటించుకున్నాడు. ఇదే 2006లో పేరు మార్చుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాగా అవతరించింది. అప్పట్నుంచి బాగ్దాదీ ఐఎస్ ఐఎస్ లో చురుగ్గా వ్యవరిస్తూ వచ్చాడు.
అయితే, ఐసిస్ వ్యవస్థాపకుడు అల్ ఒమర్ అల్ బాగ్దాదీ... 2010లో అమెరికా సైన్యం దాడిలో మరణించడంతో... ఐఎస్ ఐఎస్ పగ్గాలు చేపట్టి ఇరాక్, సిరియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నరమేథం సృష్టించాడు. ఆల్ ఖైదా అధినేత లాడెన్ ను మించిన క్రూరత్వంతో ప్రపంచానికే వణుకుపుట్టించాడు. ఆల్ ఖైదాను తలదన్నేలా ఉగ్ర దాడులతో రక్తపాతాన్ని సృష్టించాడు.
అయితే, బాగ్దాదీ కోసం ఎప్పట్నుంచో వెదుకుతోన్న అమెరికా సైన్యం.... పక్కా సమాచారంతోనే అంతమొందించింది. సొంత అనుచరుడు ఇచ్చిన సమాచారంతోనే బాగ్దాదీని అమెరికన్ ఆర్మీ మట్టుబెట్టింది. బాగ్దాదీకి అంత్యంత సన్నిహితుడైన ఇస్మాయిల్ అల్ ఎతావి టర్కీ బలగాలకు పట్టుబడటమే... బాగ్దాదీ అంతానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. టర్కీ నుంచి ఇరాక్ సైన్యం ఆధీనంలోకి వచ్చిన ఇస్మాయిల్ ఎతావి ఇఛ్చిన సమాచారంతోనే బాగ్దాదీని అమెరికా సైన్యం వెంటాడింది. ఐసిస్ స్థావరాలు, బాగ్దాదీ సంచరించే ప్రాంతాలు పక్కాగా తెలియడంతో... ఈశాన్య సిరియా ఇడ్లిట్ ప్రాంతంలో అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ మొత్తం ఐదారు నెలలపాటు సాగింది. అలా బాగ్దాదీని వెంటాడి వేటాడటంతో మరో దారి లేని పరిస్థితుల్లో ఆత్మాహుతి చేసుకోవడంతో కరుడుగట్టిన ఉగ్రవాది అంతమయ్యాడు.