జగన్ ను తిట్టిన ఐఏఎస్ కే బీజేపీ టికెట్
posted on Mar 24, 2021 @ 5:42PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుండగా... జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు తిరుపతి ఎన్నికను అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంమైన తిరుపతిలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తున్న కమలదళం.. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను రంగంలోకి దింపింది. సిన్సియర్ అధికారిగా పేరున్న రత్నప్రభ పోటీ చేస్తుండటంతో తిరుపతి ఎన్నిక మరింత రంజుగా మారింది.
తిరుపతి ఉపఎన్నికలో రత్నప్రభను పోటీలో దింపడానికి బీజేపీకి పెద్ద లెక్కో ఉందంటున్నారు. రత్నప్రభ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ద వ్యతిరేకి అని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రత్నప్రభ కూడా ఒక బాధితురాలే. జగన్ సీబీఐ కేసులో నిందితురాలిగా చేర్చబడ్డ ఐఏయస్ అధికారి రత్నప్రభకు.. తర్వాత హైకోర్టు విముక్తి ప్రసాదించింది. నిజాయితీగా పనిచేసిన రత్నప్రభ.. సీబీఐ కేసు ఎదుర్కోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కోపాన్ని ఆమె జగన్ పై నేరుగానే చూపించారు. కోర్టు ఆవరణలోనే చివాట్లు పెట్టారు. వైఎస్ కుటుంబంపై ఆగ్రహంగా , జగన్ అంటే చిర్రుత్తుకొచ్చే రత్నప్రభను కావాలనే బీజేపీ ఇప్పుడు తిరుపతిలో టికెట్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్.
2013 నవంబర్ లో ఇందు టెక్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన వస్తున్న రత్నప్రభకు జగన్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా జగన్ పై ఆమె తీవ్ర ఆగ్రహంతో మహంకాళిగా ఊగిపోయారు. వాట్ మిస్టర్ జగన్.. వాటీజ్ దిస్ నాన్ సెన్స్.. మీరెవరో నాకు తెలియదు... మిమ్మల్ని నేనుప్పుడు చూడలేదు.. మీవల్ల మీమందరం సమస్యలో పడ్డాం. . ఈ గొడవలతో మాకేం సంబంధం లేదు.. రూల్స్ ప్రకారమే మేం ముందుకు వెళ్లాం.. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. మేం పాటించాం.. మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.. ఇంతకాలం నిజాయితీగా బతికి.. మీ కారణంగా ఆభాసుపాలయ్యామంటూ జగన్ ను రత్నప్రభ కడిగిపారేశారు. కోర్టు ఆవరణలోనే, అందరూ చూస్తుండగానే రత్నప్రభ సీరియస్ కామెంట్లు చేయడంతో అవాక్కైన జగన్.. మంచి రోజులు వస్తాయ్ మేడమ్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏంటీ వచ్చేది అంటూ రత్నప్రభ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం స్పష్టించింది. కోర్టులో రత్నప్రభ ఆవేశాన్ని చూసిన వారు.. జగన్ పై ఆమెకు ఎంత కోపం ఉందో బయటపడిందని అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కత్తి చంద్రయ్య కూతురే రత్నప్రభ.. సిన్సియర్ అధికారిగా పేరు. కర్ణాటక కేడర్ కు చెందిన రత్నప్రభ.. వైఎస్సార్ హయాంలో డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. ఐటీ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందు టెక్ ప్రాజెక్టు అనే సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల స్థలం కేటాయించారు. వైఎస్ మరణం తరువాత.. ఆ కేటాయింపుల విషయంలోనే అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ కేసులు నమోదయ్యాయి. రత్నప్రభ పేరును చార్జ్ షీట్లో ఏడవ ముద్దాయిగా చేర్చారు. కానీ ఆమె తాను ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాను తప్ప, స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదని, ఆ వ్యవహారంలో తను ఎటువంటి ప్రయోజనమూ పొందలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె వాదనలో ఎకీభవించిన కోర్టు ఆమెను కేసుల నుండి తొలగించింది.
సీబీఐ కేసుల నుంచి బయటపడినా... కోర్టులు తిరిగిన పరిస్తితును రత్నప్రభ మర్చిపోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిజాయితీగా పనిచేసినా కోర్టు కేసుల్లో చిక్కుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయారంటున్నారు. తన కారణంగా రత్నప్రభ ఇబ్బండి పడ్డారనే విషయం జగన్ కు కూడా తెలుసని చెబుతున్నారు. జగన్ గురించి పూర్తి తెలుసు కాబట్టే ఆమెను తిరుపతి బరిలో నిలిపారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ వల్ల తాను పడిన ఇబ్బందులను రత్నప్రభ చెబితే... వైసీపీకి కష్టమేననే చర్చ జరుగుతోంది. అంతేకాదు సిన్సియర్ ఐఏఎస్ గా గుర్తింపు పొందిన రత్నప్రభకు జనాల నుంచి మంచి స్పందన వస్తుందని కమలదళం ఆశలు పెట్టుకుంది. ఇలా అన్ని పరిశీలించాకే... తిరుపతికి రత్నప్రభ పేరును బీజేపీ పెద్దలు ఖరారు చేశారని తెలుస్తోంది. మరీ తిరుపతి ప్రచారంలో రత్నప్రభ జగన్ ను టార్గెట్ చేస్తారా.. చేస్తే వైసీపీ ఇబ్బందులు తప్పవా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.. చూడాలీ మరీ తిరుపతిలో ఏం జరగబోతోందో...