ఈ కరోనా న్యూస్ చదివితే.. గుండె గుబేల్..
posted on Mar 24, 2021 @ 5:42PM
దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్. కొత్తరకం స్ట్రెయిన్‌లతో కలవరం. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలి పోతున్నారు జనం. ప్రజల భయానికి తగ్గట్టే కేసుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. అందులో అనేకం కొత్త రకం కరోనా వైరస్ వల్ల వచ్చినవే కావడం మరింత ఆందోళనకరం. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న కొత్త రకం కేసులు.. గత ఐదు రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం స్టెయిన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.
ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్‌లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో విదేశాల్లో బయటపడిన కొత్తరకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్‌లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణకు కారణం ఈ కొత్తరకం స్ట్రెయిన్‌లే అని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లభించలేదని తెలిపింది.
విదేశాల నుంచి వస్తోన్న వారిలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్ శాంపిళ్లను కేంద్ర ఆరోగ్యశాఖ సేకరించి, పరీక్షించి విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం, 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా రకం, 1 శాంపిల్‌లో బ్రెజిల్ రకం స్టెయిన్ గుర్తించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త రకాలు స్టెయిన్‌లు కనిపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. గత డిసెంబర్‌లో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే, కొత్త మ్యుటేషన్ల నమూనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్రం తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగ నిరోధకతను తట్టుకొని వైరస్ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోంది. 3 కోట్లకు పైగా కేసులతో అమెరికా ప్రపంచంలోనే ప్రధాన స్థానంలో నిలిచింది. బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. 1.17కోట్ల కేసులతో ఇండియా మూడో స్థానంలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌లో కొవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇండియా తర్వాత.. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, టర్కీ, జర్మనీ వరుసగా టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
దేశంలో బుధవారం నమోదైన కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు మరోసారి ఆంక్షలు ప్రకటించాయి.
సెకెండ్ వేవ్ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుప్పకూలేలా చేశాయి. బుధవారం సెన్సెస్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 49,786తో ప్రారంభమైన సెన్సెక్స్ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక 14,712 దగ్గర మొదలైన నిఫ్టీ.. 265 పాయింట్లు పతనమై.. 14,549 దగ్గర ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో, దేశీయ సూచీలు సైతం ఢమాల్. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆర్థిక, మౌలిక రంగాల్లోని షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.