శ్రీలంకతో టి20 సిరీస్ కు టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరంటే?
posted on Dec 28, 2022 @ 3:57PM
వచ్చే నెలలో టి20, వన్డే సిరీస్ ల కోసం శ్రీలంక భారత్ లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ లో టీమ్ ఇండియా పర్యటన పూర్తయిన వెంటనే శ్రీలంక దేశంలో పర్యటిస్తోంది. జనవరి మూడు నుంచి నుంచి టి20 సిరీస్, అదే నెల 10 నుంచి వన్డే సీరిస్ ప్రారంభమౌతాయి. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు సిరీస్ ల కోసం టీమ్ ఇండియా ఇంకా జట్లను ప్రకటించలేదు.
సమస్య ఏమిటంటే బంగ్లా పర్యటనలో గాయపడిన స్కిప్పర్ రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకున్నాడా లేదా అన్న విషయం స్పష్టం కాలేదు. ఇక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లంకతో స్వదేశంలో జరిగే వన్డే, టి20 సిరీస్ లకు అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే ప్రకటించారు. అతియా శెట్టితో వివాహం కారణంగా రాహుల్ ఈ సిరీస్ లకు దూరం అవుతున్నాడు.
ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ ఎవరు అన్న విషయంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే టీమ్ ఇండియా మ్యాచ్ లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ తాజాగా విడుదల చేసిన ప్రోమో కారణంగా టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ ఎవరన్నది అందరికీ తెలిసిపోయింది.
న్యూ ఇయర్ లో లంకతో పోరాడేందుకు హార్థిక్ పాండ్యా సిద్ధం అంటూ స్టార్ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ తో క్రికెట్ అభిమానులంతా లంకతో సిరీస్ కు కెప్టెన్ హార్థిక్ పాండ్యాయే అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే బీసీసీఐ చర్చల్లో హార్దిక్ పాండ్యా పేరు కూడా పరిశీలనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సెలక్టర్లు ప్రకటించడానికి ముందే స్టార్ స్పోర్ట్స్ తదుపరి కెప్టెన్ ఎవరో వెల్లడించేసిందని అభిమానులు జోక్ చేస్తున్నారు.