భారత్ లో ఒలింపిక్స్ ఎప్పుడంటే?
posted on Dec 28, 2022 @ 3:36PM
ఒలింపిక్స్ కు భారత్ ఆతిధ్యం ఎప్పుడు ఇస్తుంది అన్నది ఇంత కాలం సమాధానం తెలియని ప్రశ్న. గతంలో ఎప్పుడో తెలుగుదేశం అధినేత ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే సత్తా భారత్ కు ఉందని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను సీఎంగా ఉన్న సమయంలో జాతీయ క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించి ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఆ సందర్భంలోనే ఆయన ఏపీ లో ఒలింపిక్స్ నిర్వహణ గురించి ప్రస్తావించారు.
అయితే ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహణ అన్న ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా కేంద్ర క్రీడా మంత్రి భారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒలింపిక్స్ నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ గుజరాత్ లో ఉన్నాయన్నారు. దేశంలో పలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఈవెంట్స్ ను హోస్ట్ చేయటాన్ని సవాల్ గా తీసుకున్న మోడీ సర్కార్ 2036లో జరగబోయే ఒలింపిక్స్ కు బిడ్ వేస్తుందని ప్రకటించారు.
గతంలోనే ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన భారత్, త్వరలో జీ-20 భేటీకి ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమని చాటింది. అయితే 2032 వరకూ ఒలింపిక్స్ నిర్వహించేందుకు స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయిన నేపథ్యంలో 2036 లో జరిగే ఒలింపిక్స్ కు వేదికగా భారత్ ను చేసేందుకు భారత్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది.