కౌన్ బనేగా ఎస్ఈసీ?
posted on Mar 24, 2021 @ 1:22PM
వడ్డించే వాడు మనవాడైతే.. పదవులు కోరి వరిస్తాయి. ఏపీలో అదే జరుగుతోంది. కీలక పదవుల్లో తన అనునాయులనే నియమించుకుంటున్నారు సీఎం జగన్. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిలు ఇలా ప్రధాన్య పోస్టులు పొందినవారే. ఇప్పుడు ఆ కోవలోనే.. కాబోయే ఎస్‌ఈసీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎస్ఈసీ అంటే లూప్ లైన్ పోస్టుగా ఉండేది. కానీ, నిమ్మగడ్డ ఎపిసోడ్‌తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఖతర్నాక్ అనే రేంజ్‌లో ఆ పదవికే పవర్ తీసుకొచ్చారు రమేశ్‌కుమారు. ఈ రెండేళ్లలో సీఎం జగన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎస్ఈసీనే. అంతటి పవర్‌ఫుల్ పోస్టులో నెక్ట్స్ ఎవరు రాబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ మార్చి 31న రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు పేర్లతో ప్యానెల్ రెడీ చేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని.. నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు శామ్యూల్.. ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్ అధికారి ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఈ ముగ్గురిలో శామ్యూల్ రేసులో ముందున్నారు. సీఎం జగన్ సైతం శామ్యూల్‌పైనే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
శామ్యూల్.. వాన్‌పిక్ స్కాం కేసులో నిందితుడు. ఆయన 2014లోనే రిటైర్ అయ్యారు. అప్పట్లోనే శామ్యూల్ చీఫ్ సెక్రటరీ పోస్టుకు పోటీ పడినా.. వాన్‌పిక్ కేసులో సహనిందితుడిగా ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను సీఎస్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ విషయంలో ఆయన కేంద్ర అడ్మినిస్ర్టేటివ్ ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో.. సీసీఎల్‌ఏగానే పదవీ విరమణ చేశారు శామ్యూల్. జగన్ సీఎం అయిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి సలహాదారుడిగా మళ్లీ యాక్టివ్ అయ్యారు శామ్యూల్. వైసీపీ ఎన్నికల హామీ అయిన నవరత్నాల పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఎస్ఈసీ రేసులో నిలిచారు.
ఎస్ఈసీ జాబితాలో ఉన్న మరో ఇద్దరూ కీలకమైన అధికారులే. సీఎస్‌గా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సలహాదారుగా ఉన్న నీలం సాహ్నితో పాటు ఇటీవలే రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందిన ప్రేమ్‌చంద్రారెడ్డి ప్యానెల్‌లో ఉన్నారు. ముగ్గురూ సమర్థులైన అధికారులే కావడంతో వీరిలో ఎవరిని ఎస్ఈసీ వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎస్ఈసీ ఎంపిక అధికారం రాష్ట్ర గవర్నర్‌దే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టప్రకారం.. ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమించాలి. అయితే, ఇందులో వయసుకు సంబంధించి వివాదమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. ఇందులో ఏది ముందైతే అది. దీని ప్రకారం శామ్యూల్, ప్రేమ్‌చంద్రారెడ్డిల వయసు 67 ఏళ్లు. నీలం సాహ్ని ఏజ్ మాత్రం 65 ఏళ్లలోపే. ఒకవేళ గవర్నర్ ఏపీ చట్టాల ప్రకారం నియామకం చేపడితే ఎస్ఈసీగా శామ్యూల్‌కు అవకాశం దక్కొచ్చు. అదే, కేంద్ర నిబంధనల ప్రకారమైతే నీలం సాహ్నికి ఆ పదవి వరిస్తుంది. ముగ్గురిలో ఎవరికి వచ్చినా.. వారు ప్రభుత్వానికి అనుకూలమే అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది త్వరలోనే తేలనుంది.