ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి..
posted on Mar 24, 2021 @ 1:49PM
బీహార్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను నిలువరించేందుకు మార్షల్స్‌తో పాటు సభలోకి పోలీసులను పిలిపించారు. దీంతో అసెంబ్లీలో తీవ్క ఉద్రిక్తత నెలకొంది. కొందరు భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని బయటకు ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలోని సాయుధ పోలీసు బలగాలను మరిన్ని అధికారాలను కల్పించే బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్లు-2021 ను తీసుకొచ్చింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వారెంటు లేకుండా పోలీసులు ఎక్కడైనా తనిఖీ చేసేలా, ఎవరినైనా అరెస్టు చేసేలా అధికారమిచ్చే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విపక్ష పార్టీలు సభలో నుంచి వాక్ అవుట్ చేసిన సమయంలో సభలో ఈ బిల్లను ఆమోదించారు.
ఆ తర్వాత సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. శాసనసభలో స్పీకర్ తన చైర్ వద్దకు వెళ్లకుండా విపక్షాలకు చెందిన మహిళ సభ్యలు పొడియంను చుట్టూ చేరారు. మరోవైపు వెల్‌లోకి వచ్చిన ఇతర విపక్ష సభ్యులు అక్కడ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే సభలో కొందరు అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య వాగ్వాదం జరిగింది. సభను అదుపు చేయడం కష్టంగా మారడంతో సభను వాయిదా వేశారు. అయినా ఆర్జేడీ సభ్యులు సభలోనే ఉండిపోయారు.
దీంతో సభలో ఉన్న ఆర్జేడీతో పాటు ఇతర విపక్ష సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. వారికి సహకరించేందుకు పోలీసులను కూడా లోనికి తీసుకొచ్చారు. మార్షల్స్, పోలీసులు విపక్ష సభ్యులను బయటకు తీసుకెళ్లే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. కొందరు పోలీసులు ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని సభలో నుంచి బయటకు లాక్కుని వెళ్లారు. మహిళ ఎమ్మెల్యేల జట్లు పట్టి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యే గాయపడగా, కొందరు స్పృహ కోల్పోయారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను షేర్ చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. నితీశ్ కుమార్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.