కొండా సురేఖ పోటీకి సిద్ధమేనా? హుజురాబాద్ లో రేవంత్ వ్యూహమేంటీ?
posted on Sep 29, 2021 @ 9:40AM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరగబోతున్న ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే పార్టీలు దూకుడు పెంచాయి. బైపోల్ ను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ తమ బలగాలను అక్కడే మోహరించింది. ముందుగానే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. దళిత బంధు స్కీంతో ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా కైవసం చేసుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా హరీష్ రావు హజురాబాద్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఈటలతో ఉన్న నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కారెక్కేలా ఆయన పావులు కదుపుతున్నారు.
తన కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి సీఎం కేసీఆర్ కు షాకివ్వాలని చూస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. అందుకే షెడ్యూల్ రాకముందే ఓ రౌండ్ ప్రచారం చేసేసారు ఈటల. పాదయాత్రతో కొన్ని గ్రామాలు తిరిగారు. షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నేతలంతా ప్రచారం చేయబోతున్నారు. ప్రజా సంగ్రామ్ యాత్ర చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... అక్టోబర్ 2న హుజురాబాద్ లో తన తొలి దశ యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో భారీ సభ పెట్టి.. ఆ వేదిక నుంచే ఉప ఎన్నికల ప్రచార శంఖారావం పూరించాలని బీజేపీ భావిస్తోంది. బండి సంజయ్ సభను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ నేతలు కూడా హుజురాబాద్ లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా సైలెంటుగానే ఉంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. కాని అత్యంత కీలకమైన ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ పై మాత్రం ఫోకస్ చేయలేదు. మిగితా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని కూడా తేల్చలేదు. షెడ్యూల్ కూడా రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి హుజురాబాద్ వెళ్లకపోవడంతో... ఉప ఎన్నికపై ఆయన స్టాండ్ ఏంటన్నది తెలియడం లేదు. హుజురాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్ గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.
ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో కాంగ్రెస్లో హడావుడి మొదలైంది. ఈనెల 30న భూపాలపల్లిలో జరిగే సభలో అభ్యర్థి ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ నేతృత్యంలోని కమిటీ కొద్ది రోజుల క్రితమే నాలుగు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపింది. బయోడేటా, బలాబలాల వివరాలతో నివేదిక ఇచ్చింది. కవ్వంపల్లి సత్యనారాయణ (ఎస్సీ-మాదిగ), కొండా సురేఖ (బీసీ -పద్మశాలి), పత్తి కృష్ణారెడ్డి (రెడ్డి), ప్యాట రమేశ్ (బీసీ -మున్నూరు కాపు) పేర్లను పంపినట్లు సమాచారం. భూపాలపల్లిలో పట్టున్న నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా 30న భారీ సభ జరగనుంది. అభ్యర్థి ప్రకటనకు దాన్ని సరైన వేదికగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం గతంలో జరిగింది. కొండా దంపతుల సామాజిక వర్గాలు నియోజకవర్గంలో బలంగా ఉండటం తమకు లాభిస్తుందని హస్తం నేతలు అంచనా వేశారు. పోటీకి కొండా సురేఖ కూడా అంగీకరించిందని, అయితే కొన్ని కండీషన్లు పెట్టిందనే ప్రచారం జరిగింది. తర్వాత సీన్ మారిపోయింది. కొండా అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించారని, దామోదర రాజనర్సింహ కమిటి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనే చర్చ బయటికొచ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కరీంనగర్లో జరిగిన సమీక్షలో లోకల్లీడర్లు కొండా అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. దాంతో అభ్యర్థి ఎంపికకు కమిటీ వేయగా 19 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఆసక్తిగా మారింది. కొండా సురేఖను ఖరారు చేస్తారా లేక లోకల్ లీడర్ ను బరిలోకి దింపుతారా అన్నది ఈనెల 30న తేలనుంది. కొండా సురేఖను ప్రకటిస్తే... కాంగ్రెస్ సీరియస్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది.
అయితే ఈటల రాజేందర్ తో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆయనకు కాంగ్రెస్ లోపాయకారిగా మద్దతు ఇవ్వవచ్చనే చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే ఈటలకు లాభించేలా హుజురాబాద్ లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థి నిలపవచ్చని కూడా చెబుతున్నారు. మొత్తంగా రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక వస్తున్న తొలి ఎన్నిక కావడంతో.. ఆయన ఎలాంటి వైఖరి అవలంభిస్తారని రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.