ఎంపీ రఘరామ రాజును కొట్టిందెవరు? సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది?
posted on May 16, 2021 @ 10:12AM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. సీఐడీ ఆఫీసుతో తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆయన కాళ్లకు గాయాలు ఉండటంతో ఆరో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు వైద్య విచారణకు ఆదేశించింది. గుంటూరు జీజీహెచ్ తో పాటు రమేష్ హాస్పిటల్స్ వైద్యులు ఆయనను పరీక్షించారు.
రఘురామ రాజు కాళ్లకు ఉన్న గాయాలపై వైద్యులు ఇచ్చే నివేదిక కీలకంగా మారింది. అయితే రఘురామ రాజు చెప్పినట్లు ఆయనపై దాడి జరిగితే.. ఆయన్ను కొట్టిందెవరు? అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయన్నది తీవ్ర దుమారం రేపుతోంది. తనకు జరిగిన గాయాలపై రఘురామ రాజు ఫిర్యాదులో చెప్పిన దాని ప్రకారం.. సీఐడీ కస్టడీలో ఉన్నతనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తన కాళ్లను తాళ్లతో కట్టేసి... అరికాళ్లపై కర్రలు, ఫైబర్ లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలతో కమిలిపోయి ఉన్న పాదాలను జడ్జికి చూపించారు.
రఘురామ రాజును సీఐడీ పోలీసులుగుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానమైన ఆరో మున్సిఫ్ మెజిస్ర్టేటు కోర్టులో హాజరుపరిచారు. రఘురామ రాజు నడవడానికి ఇబ్బంది పడుతూ... కష్టం మీద కోర్టులోకి ప్రవేశించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరుపరిచే వరకు చోటుచేసుకున్న పరిణామాలన్నింటిపైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని కోరారు. అందుకు మేజిస్ర్టేటు అరుణకుమారి అంగీకరించటంతో నాలుగు పేజీల ఫిర్యాదును అందించారు. శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తరువాత సీఐడీ కార్యాలయంలో తాను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా... హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు తాను ఉన్న గదిలోకి వచ్చారని. వాళ్లంతా ముఖాలకు కర్చీ్‌ఫలు కట్టుకున్నారని వివరించారు. అయితే వచ్చీ రాగానే తన రెండు కాళ్లను తాడుతో కట్టారని. ఒకవ్యక్తి కర్రతో కొట్టాడని. మరొక వ్యక్తి... ఫైబర్ లాఠీ తో తన రెండు అరికాళ్లపై కొట్టాడని పేర్కొన్నారు.. అంతలా కొట్టినా వారి కసి తీరలేదని.. తనను గదిలో అటూ ఇటూ నడవమన్నారని. తాను నడిచాను అన్నారు. ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై నాలుగైదుసార్లు గట్టిగా కొట్టారని పేర్కొన్నారు. తరువాత మళ్లీ నడవమన్నారని. ఈసారి తాను నడవలేకపోయానని దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ కోర్టుకు తెలిపారు రఘురామ రాజు. అరెస్టు తర్వాత తన పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ కొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు.
తన అరికాళ్లకు తగిలిన గాయాలు, కమిలిన దెబ్బలను మేజిస్ట్రేట్ కు చూపారు రఘురామ రాజు. కోర్టులో న్యాయవాదులందరినీ బయటకు పంపి... ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్న అంశాలను మేజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత విచారణ సందర్భంగా... ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తామని మేజిస్ట్రేట్ చెప్పగా.. ఎంపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించింది. విచారణ పేరుతో కొట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వాసుపత్రికి పంపితే అక్కడ న్యాయం జరగకపోగా, ఆయన ప్రాణానికే హాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీని గుంటూరులోని రమేష్ హాస్పటల్‌కు తరలించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై మేజిస్ట్రేట్ స్పందిస్తూ... నిందితుడి పాదాలు కమిలిపోయి ఉన్నాయి. వైద్య పరీక్షలు కచ్చితంగా అవసరం. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, రమేష్ ఆస్పత్రి వైద్యులు... కేంద్రం కల్పించిన వై-కేటగిరీ భద్రత సమక్షంలోనే ఆయనను పరీక్షించాలి సూచించింది. అవి తాజా గాయాలని తేలితే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.