చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులెవరు?
posted on Jun 6, 2024 @ 1:54PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందు వున్న అతి పెద్ద టాస్క్ మంత్రివర్గ కూర్పు. ఇప్పటికి చాలాసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ఎన్నోసార్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడంలో ఎంతో అనుభవం వున్నప్పటికీ, చంద్రబాబుకు ఈసారి మంత్రివర్గాన్ని కూర్చుకోవడం బిగ్ టాస్క్‌గా మారే అవకాశం వుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారు, గతంలో మంత్రులుగా ప్రతిభావంతంగా సేవలు అందించినవారు, ఉరకలెత్తే ఉత్సాహంతో వున్న కొత్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చాలామంది వున్నారు. వీరందరూ మంత్రి పదవులు అధిష్టించడానికి అర్హులే... కానీ మంత్రి పదవులకు కూడా ‘రేషన్’ వుంటుంది కాబట్టి, చాలా ఆచితూచి వీరిలోంచి మంత్రులను ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. అలాగే మిత్రపక్షాలుగా వున్న బీజేపీ, జనసేన పార్టీలకు కూడా మంత్రిపదవులను కేటాయించాల్సి వుంటుంది. పైగా మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా భారీగా వుండటం వల్ల కూడా మంత్రివర్గాన్ని కూర్చాలంటే చంద్రబాబు చాలా కసరత్తు చేయాల్సిన అవసరం వుంది.
తెలుగుదేశం పార్టీ 2014లో అధికారం చేపట్టినప్పుడు నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి వస్తారా.. లేక పార్టీని బలోపేతం చేసే పనిలో వుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈసారి మీరు మంత్రివర్గంలోకి వస్తారా అని లోకేష్‌ని ప్రశ్నిస్తే, ఆయన చాలా సింపుల్‌గా ‘పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది చేస్తాను’ అని చెప్పేశారు.
బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరు సభ్యులకయితే మంత్రి పదవులు దక్కే అవకాశం అయితే వుంది. ఆ సభ్యులెవరన్నది నిర్ణయించుకోవాల్సింది బీజేపీనే. మరి బీజేపీ ఇద్దరితో ఆగుతుందా.. ఇంకా కొన్ని మంత్రి పదవులు కొసరుతుందా అనేది చూడాలి. కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజుకు ఈసారి కూడా అవకాశం దక్కుతుందా.. లేక కొత్తవారికి అవకాశాలు దక్కుతాయా అనేది బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి.. ఈ విషయంలో చంద్రబాబు కసరత్తు చేయాల్సిన అవసరం అంతగా వుండకపోవచ్చు. సుజనా చౌదరి, సత్యకుమార్, పార్థసారథి కూడా మంత్రిపదవుల ఆశావహుల్లో వున్నారు.
ఇక జనసేన విషయానికి వస్తే, విజయానంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా వుంటూనే, అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు. మరి, మంత్రివర్గంలో జనసేన కోటా ఎంత? పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో వుంటారా? తన పార్టీ ఎమ్మెల్యేలకు కీలకమైన మంత్రి పదవులు వచ్చేలా చూసుకుని, తాను మాత్రం జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తారా అనే రెండు ఆప్షన్లు వన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన మంత్రిపదవి తీసుకోవాలనే కోరుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణలతోపాటు మరో ఇద్దరు బీసీ, ఎస్సీ/ఎస్టీ వర్గాలవారు పరిశీలనలో వున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేది జూన్ 12.. అంటే.. ఇంకా సమయం వుంది కాబట్టి... మూడు నాలుగు రోజుల్లో బీజేపీ, జనసేన నుంచి మంత్రులు అయ్యేవారు ఎవరనే విషయంలో స్పష్టత వస్తుంది.
ఇక తెలుగుదేశం పార్టీలో ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యా బాగా పెరిగింది. అందరూ యువతరం ప్రతినిధులే. ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్లకంటే యువత, బలహీనవర్గాలు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేలలో ఆశలు చిగురించాయి. మొదటిసారి గెలిచిన మాధవీరెడ్డి (కడప), సింధూరరెడ్డి (పుట్టపర్తి), సవిత (పెనుకొండ), బండారు శ్రావణిశ్రీ (శింగనమల), నెలవల జయశ్రీ (సూళ్ళూరుపేట), శిరీషాదేవి (రంపచోడవరం), జగదీశ్వరి (కురుపాం), గల్లా మాధవి (గుంటూరు పశ్చిమ), యనమల దివ్య (తుని), అదితి గజపతిరాజు (విజయనగరం) తదితరులలో జిల్లా, సామాజికవర్గం.. తదితర లెక్కల ప్రకారం ఎవరిని మంత్రిపదవులు వరిస్తాయో చూడాలి. రెండోసారి గెలిచిన మహిళలు తంగిరాల సౌమ్య (నందిగామ), వంగలపూడి అనిత (పాయకరావుపేట) మంత్రి పదవి ఆశావహులలో వున్నారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తెలుగుదేశం ఎమ్మల్యేలలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ (శ్రీకాకుళం), కోండ్రు మురళీమోహన్, ఆర్.వి.ఎస్.కె.రంగారావు, కళా వెంకట్రావు (విజయనగరం), గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు (విశాఖపట్నం), యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ), చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి (తూర్పు గోదావరి), పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు (పశ్చిమ గోదావరి), పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య (కృష్ణాజిల్లా), కన్నా లక్షీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణకుమార్ (గుంటూరు జిల్లా), గొట్టిపాటి రవికు్మార్, ఏలూరు సాంబశివరావు, బి.ఎన్.విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి (ప్రకాశం), నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (నెల్లూరు), అమర్నాథ్ రెడ్డి, మరో ఎస్సీ ఎమ్మెల్యే (చిత్తూరు), పయ్యావుల కేశవ్ కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత (అనంతపురం), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి (కర్నూలు), సుధాకర్ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (కడప) తదితరులు పేర్లు మంత్రి పదవుల పరిశీలనలో వున్నట్టు తెలుస్తోంది. మైనారిటీ ఎమ్మెల్యేలు ఎన్‌ఎండీ ఫరూఖ్ (నంద్యాల), నసీర్ (గుంటూరు), షాజహాన్ బాషా (మదనపల్లి)లో ఒకరికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం.