సిబిఐ జేడీ సందడి ఎక్కడ?
posted on Oct 29, 2012 @ 4:09PM
జగన్ అక్రమాస్తుల కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, సమన్లు, అరెస్టులతో సంచలనం సృష్టించిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు ఈ మధ్య వార్తలలో ఎక్కడా కనపడడం లేదు. జగన్ అరెస్టు తర్వాత లక్ష్మీనారాయణను రియల్ హీరోగా కీర్తిస్తూ, ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే ఆయన ఫోన్ సంభాషణల వివాదం తర్వాత సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. జగన్ కేసుకు సంబంధించి రాజకీయ స్థాయిలో ఏవైనా రాజీ ఒప్పందాలు కుదిరాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనికి తోడు ఈ కేసులో ఒక్కొక్కరికి నెమ్మది నెమ్మదిగా బెయిల్ మంజూరు అవుతోంది. మరోవైపు మంత్రులు ధర్మాన ప్రసాదరావు తదితరులపై ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. ముద్దాయిలుగా మంత్రుల పేర్లు వున్నప్పటికీ వారు పదవుల్లో దర్జాగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే జగన్ అక్రమాస్తుల కేసులో కంటికి కనిపించని మతలబు ఏదో జరుగుతోందనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.