షా సభ వాయిదా .. పొంగులేటి సైలెన్స్.. లింకేంటి?
posted on Jun 16, 2023 @ 11:23PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... ఖమ్మం సభ రద్దయింది. సరే అది అసలు కారణం అయినా కాకున్నా, బిఫర్ జాయ్ తుపాను కమ్ముకొస్తున్న కారణంగానే అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన, ఖమ్మం సభ రద్దయ్యాయని బీజేపీ చెపుతున్న కారణం కొంత సహేతుకంగానే వుంది. కానీ, ఓ వంక మాజీ ఎంపీ పొంగులేటి ప్రహసనం నడుస్తున్న సమయంలో ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని మీడియా కథనాలు వండి వరుస్తున్న సమయంలో, అమిత్ షా పోయి పోయి ఖమ్మంలో సభ పెట్టడమే, ఓ పెద్ద పజిలింగ్ ప్రశ్న అయితే ఆ సభ రద్దు కావడం దానితో పాటుగా పొంగులేటి సైలెంటైపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
నిజానికి, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి నప్పటి నుంచి ఇంకా మాట్లాడితే అంతకు ముందు నుంచీకూడా పొంగులేటి, ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, వార్తల్లో వ్యక్తులుగా ప్రచారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆ ఇద్దరూ అందుకు తగిన వేదిక ఏది? కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీలో చేరితే తమ లక్ష్యం నెరవేరుతుంది? అనే దిశగా సమాలోచనలు జరుపుతున్నారు. అలాగే తమవంటి బీఆర్ఎస్ బాధితులను చేరదీసి కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేశారు.
అదే సమయంలో ఇటు కాంగ్రెస్ అటు బీజీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆ ఇద్దరికీ, రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు పోటాపోటీ ప్రయత్నాలు సాగించారు. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేశారు. చివరాఖరుకు ఆ ఇద్దరు కాంగ్రెస్ చేరుతున్నారని మీడియా మేథావులు నిర్ణయానికి వచ్చారు. ముహూర్తం ఖరారు చేశారు..చివరకు పొంగులేటి, జూపల్లి కూడా జూన్ 13 న తమ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలతో ఆఖరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, 14న హైదరాబాద్ లో మీడియా సమవేశంలో తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, అది జరగ లేదు. ఎందుకు? ఇప్పుడు ఇదే ప్రశ్న మీడియా మేథావుల బుర్రలు తొలిచేస్తోంది.
అమిత్ షా సభ వాయిదాకు, పొంగులేటి, జూపల్లి ప్రెస్ మీట్ వాయిదాకు లింక్ వుందా ..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖరారు అయిందే నిజం అయితే, ఆ ఇద్దరు ప్రకటించిన విధంగా జూన్ 14న మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది.
అయితే , నిజానికి పొంగులేటి మొదటి నుంచి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే, ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో చలనం లేక పోవడం, మరో వంక అంతవరకు బీజేపీపై ఒంటి కాలుపై లేచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు సైలెంట్ అయిపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందనే అనుమానాలు వ్యక్తం కావడం, అదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అదించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో పొంగులేటి పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరిగింది.
కానీ, రేపటి ఎన్నికల్లో గెలిచినా, గెలవక పోయినా... బీఆర్ఎస్ ఎదుర్కునే సత్తా...బీజేపీకి మాత్రమే ఉందని,అందుకే ఆ ఇద్దరు.. ముఖ్య్మగా పొంగులేటి చివరకు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని, అందుకే పొంగులేటి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. అయితే, చివరకు కండువా కప్పుకునే వరకు.. ..ఆ ఇద్దరు ..ఏ పార్టీలోకి అన్న సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.