టీడీపీలోకి లగడపాటి..!
posted on Jun 16, 2023 @ 4:18PM
విజయవాడ మాజీ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్.. రాజకీయాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుక రంగం సిద్దమైందనే ఓ చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఆ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి.. మళ్లీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతారని తెలుస్తోంది. అలాగే ఆయన తనయుడిని సైతం పోలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్నికి మధ్య పైకి కనిపించని యుద్దం జరుగుతోన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదని.. తాను స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినా గెలుస్తానంటూ ఇప్పటికే కేశినేని నాని స్వయంగా ప్రకటించారనే చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తారనే ప్రచారం ఓ వైపు జోరుగా జరుగుతోన్నా.. అందుకు సంబంధించిన క్లారిటీ అయితే సైకిల్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదని.. అయితే విజయవాడ ఎంపీ టికెట్ తన తమ్ముడు లేదా మరెవరికీ ఇచ్చినా.. కన్‌ఫార్మ్‌గా ఓడించి తీరుతానని కేశినేని నాని ఇప్పటికే మంగమ్మ శపథం స్టైల్‌లో చేశారనే ఓ ప్రచారం కూడా లోక్‌సభ పరిధిలో హల్‌చల్ చేస్తోంది.
అలాంటి వేళ రానున్న ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్‌ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని లగడపాటి రాజగోపాల్‌కి కట్టబెట్టే అవకాశం సైతం ఉందని సమాచారం. విజయవాడ లోక్‌సభ సీటుపై గట్టి పట్టు ఉన్న నాయకులు పసుపు పార్టీలో పలువురు ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని.. ఆ క్రమంలో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు అయితేనే కరెక్ట్ అనే చర్చ సైతం పార్టీలో జోరందుకొన్నట్లు తెలుస్తోంది. అదీకాక గతంలో విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందిన లగడపాటికి స్థానికంగా మంచి ఫాలోయింగే కాదు.. ఆయనకంటూ సొంత కేడర్ సైతం చాలా బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు లగడపాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో గెలుపొందినా.. ఆయనకు అన్ని పార్టీల నేతలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం విదితమే. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌కి దూరం జరిగినా.. స్నేహ సంబంధాలను మాత్రం ఎక్కడా ఎప్పుడు వదలు కోలేదని ఆయన సన్నిహితులే స్పష్టంగా చెబుతుంటారు. 2004లో లగడపాటి రాజగోపాల్.. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందరు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సైతం ఆయన నెగ్గారు. కానీ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ క్రమంలో రాష్ట్ర విజభన బిల్లు.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు.. లగడపాటి పెప్పర్ స్ప్రే చేయడం.. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అంతేకాదు రాష్ట్ర విజభనకు వ్యతిరేకంగా.. హైదరాబాద్ నడిబొడ్డున సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద ఆందోళనకు దిగడమే కాదు.. ఇదే అంశంపై విజయవాడలో సైతం.. ఆ మరణ నిరాహార దీక్ష చేపట్టి.. భద్రతగా ఉన్న పోలీసుల కళ్లు కప్పి.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభన జరిగితే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించడమే కాదు.. విభజన అనివార్యం కావడంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు బై బై గుడ్ బై చెప్పేసి.. తన పోలిటికల్ కేరీర్‌కి పుల్ స్టాప్ పెట్టేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన స్నేహాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో 2014లో సీఎం పీఠం ఎక్కిన చంద్రబాబుతో లగడపాటి పలుమార్లు భేటీ అయి.... విజభన హామీల కోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబుకి విన్నవించారీ లగడపాటి.
ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ గెలవబోతోంది.. ఆ పార్టీ గెలువబోతుందంటూ ఆయన స్వయంగా సర్వేలు నిర్వహించి.. ఎన్నికల ఫలితాల ప్రకటన వెలువడక మందుకు వెల్లడించి.. ఆంధ్ర ఆక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే 2018 తెలంగాణ ఫలితాలు, అలాగే 2019 ఎన్నికల్లో ఆంధ్ర ఫలితాలపై ఆయన చెప్పిన ఫలితాలు తప్పు అని స్పష్టం అయింది. దీంతో ఆయన సర్వేలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారీ లగడపాటి. మరీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా లగడపాటి విజయవాడ నుంచి బరిలోకి దింపితే.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఆయనపై ఎవరిని నిలబెట్టనున్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ సైతం రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.