చైనాలో ఏమి జరుగుతోంది ?
posted on Dec 26, 2022 @ 2:08PM
నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.. కానీ, చైనాలో కరోనా కరాళ నృత్యం భీకరంగా సాగుతోందని ప్రపంచ మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న కన్నీటి కథలు ఒక్క చైనాను మాత్రమే కాదు, ప్రపంచాన్నే కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే, ప్రసార, ప్రచార మాధ్యమాలలో వస్తున్న కథలు, కథనాలు పూర్తిగా నిజమా? అంటే అవుననో కాదనో చెప్పడం అయ్యే పని కాదు అంటున్నారు. చైనా నాలుగు గోడల మధ్య ఏమి జరిగినా, సదరు వార్త ప్రభుత్వ అంక్షల అడ్డు గోడలను దాటి యథాతథంగా ప్రపంచానికి చేరుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ... ప్రపంచ దేశాలు ఓ వంక తమ తమ దేశాల్లో కరోనా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటూనే, మరో వంక అసలు చైనాలో ఏమి జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాపై కన్నేసి ఉంచాయి.
చైనాలో పుట్టి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒకటికి రెండు మార్లు కరాళ నృత్యం సాగించిన కొవిడ్ మహమ్మారి మరోమారు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వార్తలను గమనిస్తే ఆ దేశంలో ప్రతి రోజు లక్షల్లో కేసులు ..నమోదవుతున్నాయి. .వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏది నిజం ?ఏది కాదు ? అంటే చెప్పడం కష్టం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం కొత్తగా పుట్టిన ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీ ఎఫ్. 7 కల్లోలం సృష్టిస్తున్నదనేది మాత్రం నిజం.
నిజానికి, కరోనా వైరస్ పుట్టిల్లు చైనానే అయినా,ఆ దేశం మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చినట్లు చెపుతున్న “జీరో కొవిడ్” పాలసీ కారణంగా ఇతర దేశాలలో పోలిస్తే చైనాలో కొవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, చైనాలో ఏమి జరిగినా బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా తక్కువ... కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉక్కు పిడికిలిని దాటి, సమాచారం ఏదీ అంత తేలిగ్గా ప్రపంచానికి చేరదని అంటారు. సరే అదెలా ఉన్నా, ఇంత కాలం జీరో కొవిడ్ పాలసీలో భాగంగా కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలుచేసిన చైనా ప్రభుత్వం ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు ఎక్కడంతో ప్రజా గ్రహానికి భయపడి లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. సదలించడం కాదు పూర్తిగా ఎత్తి వేసింది. ఆలా ఆంక్షలు సడలించింది మొదలు చైనాలో గత పది రోజులుగా కేసుల సంఖ్య చకచకా పైకి పాకుతోంది. వైద్య సేవలకు సిబ్బంది కరువయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, ఆసుపత్రులలో బెడ్స్ నిండిపోవడంతో కొవిడ్ బాధితులకు అసుపత్రి ప్రాంగణంలో స్టూల్స్ వేసి కూర్చో పెట్టే చికిత్స అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా కేసుల తీవ్రత కనివినీ ఎరుగని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసింది.. రోజువారీ కేసులను వెల్లడించడం లేదు. అంతేకాదు మెజారిటీ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు అందరూ కొవిడ్ బారిన పడ్డారు.. ముఖ్యంగా మహిళలు గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వృద్ధులు మరణ శయ్యపై ఉన్నారు.. వీరిలో 25 శాతం మందికి ప్రాణాపాయం ఉంది. కొవిడ్ పాజిటివ్ గా తేలిన వారు ఆసుపత్రిలో చేరేందుకు మూడు గంటల దాకా నిరీక్షించాల్సి వస్తోంది.. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటికీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
చైనా రాజధాని బీజింగ్ లో 80 శాతం పైగా ప్రజలు కొవిడ్ కు గురయ్యారు. బీజింగ్ సహా ప్రధాన నగరంలోని ఆసుపత్రులు కొవిడ్ బాధితుల, రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.. బీజింగ్ లోని ఒక ఆసుపత్రికి రోజుకు 500 పైగా సీరియస్ కేసులు వస్తున్నాయి. దీంతో తాత్కాలిక ఇన్సెంటివ్ కేర్ యూనిట్లు, పడకల పెంపును ప్రభుత్వం చేపడుతోంది. ప్రజలు సంప్రదాయ వైద్యాన్ని నమ్ముతున్నారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు నడుస్తున్నప్పటికీ వాటిల్లో కార్మికుల హాజరు 10 శాతానికి మించడం లేదు. ఇక గత వారం వరకు 99 శాతం మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక మొన్నటి వరకు జీరో కొవిడ్ బాధితులకు పాలసీ అమలు చేసిన చైనా ఇప్పుడు దానిని ఎత్తేసింది. గతంలో పాజిటివ్ కేసులు వస్తే ఐసోలేషన్లో ఉంచిన ప్రభుత్వం… ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పటికీ విధులకు రమ్మని ఆహ్వానిస్తున్నది. అంతే కాదు వివిధ రాష్ట్రాల మధ్య ఆంక్షలను కూడా పూర్తిగా సడలించింది.. అన్నింటికంటే ముఖ్యంగా విదేశాల నుంచి వస్తే పది రోజుల క్వారంటైన్ ను పూర్తిగా ఎత్తేసింది.. ప్రజలే స్వచ్ఛందంగా క్వారంటైన్ అవుతున్నారు.. ఇక రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేందుకు గంటలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ఆస్పత్రుల్లో కూడా కండిషన్ సీరియస్ గా ఉన్న వారినే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక చైనాలో మందులు కావాలంటే మనలాగా బయటకు వెళ్లి తెచ్చుకోవడం ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటాయి.. కొన్ని మందులు మాత్రమే దుకాణాల్లో విక్రయిస్తారు.. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో పారాసిటమల్ వంటి మాత్రలను ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకున్నారు.. దీంతో ఆ మాత్రలకు కొరత ఏర్పడింది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా వచ్చేందుకు చాలా సమయం పడుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాలో కొవిడ్ బాధితుల కష్టాలకు అంతూ పొంతూ లేకుండా పోతోందని, చైనాలో ఉన్న తెలుగువారి ద్వారా తెలుస్తోంది.