వైసీపీ తీరు మారుతోందా? మండలిలో మద్దతు దేనికి సంకేతం?
posted on Sep 24, 2025 @ 11:03AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ తొలి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
ఔను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీకీ, విత్త మంత్రులు నిర్మలా సీతారామన్, హెచ్ డీ కుమార స్వామిలను అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ మంగళవారం (సెప్టెంబర్ 23) మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఈ అభినందన తీర్మానానికి వైసీపీ సంపూర్ణ మద్దతు పలికింది. దీంతో ఈ అభినందన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. విషయం ఏదైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరించే వైసీపీ మొట్టమొదటి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలపడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ట్వీట్ చేసినప్పటికీ, మండలిలో జీఎస్టీని స్వాగతిస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తరువాత కారణాలేమైనా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు.. అలాగని మద్దతు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రశక్తే లేదని ఆ విధంగా చాటారు. కానీ.. కేంద్రాన్ని అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో వైసీపీ తీరు మారిందా అన్న చర్చ మొదలైంది.