చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు
posted on Sep 24, 2025 @ 10:10AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఒక సీఐ లీగల్ నోటీసులు పంపించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ సీఐ శంకరయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపారు. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులు చంద్రబాబుకు ఈ నెల 18న అందాయి. వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందకు గాను రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్‌లో నోటీసులో పేర్కొన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న జే.శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారంటూ చంద్రబాబు అప్పట్లో పలు బహిరంగ వేదికలపై పేర్కొన్న సంగతి తెలిసిందే. విధులలో అలసత్వం వహించారని శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తేసింది. ఇప్పుడు తాజాగా శంకరయ్య సీఎం చంద్రాబాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచల నంగా మారింది.