ఈ పిట్రోడాకి ఏమైంది?
posted on Sep 20, 2025 @ 10:46AM
పాక్ కి వెళ్తే సొంతింటికి వెళ్లినట్టు ఉంటుందన్నారు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల సలహాదారు శ్యాంపిట్రోడా. కొంపదీసి పిట్రోడా కూడా అద్వానీలా పాకిస్థాన్ లో పుట్టలేదు కదా అన్న అనుమానంతో ఆయన బయోగ్రఫీ తరచి చూసిన వారికి పిట్రోడా ఒడిశాలో పుట్టిన గుజరాతీ అని తెలిసింది. హమ్మయ్య బతికిపోయాం లేకుంటే ఈ రచ్చ ఎక్కడెక్కడికో వెళ్లిపోయేదన్న ఆందోళన నుంచి వారు ఒక్కసారిగా బయటపడ్డారు. నిజానికి ఒక ప్రాంతం పట్ల పైకి కనిపించేది వేరు లోపలికి కనిపించేది వేరు. టెన్ మిత్స్ అబౌట్ పాకిస్తాన్ అంటూ ఎప్పుడో రామచంద్ర గుహ వంటి వారు రాసిన వ్యాసాల సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కి సంబంధించి ఎన్నో అపోహలు ఉంటూనే ఉంటాయి. అక్కడ పైకి మనకు ఉగ్రవాదమే కనిపిస్తుంది. లోపల మరోలా ఉంటుంది. ఉండొచ్చు కూడా.
కానీ పిట్రోడా ఈ కామెంట్ చేయాల్సిన టైం మాత్రం ఇది కాదంటారు పరిశీలకులు. మొన్న ఆపరేషన్ సిందూర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పాక్ వల్ల భారత్, అమెరికా మధ్య తగువులొచ్చిన సీన్ కనిపిస్తోంది. ఇప్పటికీ పాక్, అమెరికా సాయంతో థర్డ్ పార్టీ మీడియేషన్ తో భారత్ తో సయోధ్యకు ప్రయత్నం చేస్తోంది. అందుకు భారత్ ససేమిరా అంటోంది. దానికి తోడు అమెరికా చేయి విడిచి చైనా, రష్యాలతో చెలిమి చేస్తోంది భారత్. దీనంతటికీ కారణం పాకిస్థానే.
ఎప్పుడైతే ట్రంప్ తన కుటుంబ పెట్టుబడులు పాక్ లో పెడుతున్నారో, అప్పటి నంచీ గతంలో ఎన్నడూ లేనంతగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని దగ్గరకు చేర్చుకుంటున్నారు. అప్పటి నుంచీ అమెరికాకు మనకూ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. భారత్, పాక్ ఘర్షణలు ఆపింది ట్రంపే అన్న కోణంలో పాక్ ఆయనకు నోబుల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం, భారత్ ఇందుకు ఒప్పుకోక పోవడం వంటి కారణాల రీత్యా ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయ్. దీనంతటికీ కారణం పాకిస్థానే.
ఈ క్రమంలో పిట్రోడా ఈ పిచ్చి ప్రేలాపన చేయడంతో అందరిలోనూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడ్ పాక్ విషయంలో చేసిన కామెంట్లతో ఊరుకోకుండా.. నేపాల్, బంగ్లా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడమంటున్నారు. ఇటీవలే నేపాల్ మొత్తం తగలబడగా.. ఇక బంగ్లా లో మిలటరీ వర్సెస్ తాత్కాలిక ప్రభుత్వంగా మారింది పరిస్థితి. తాత్కాలిక బంగ్లా ప్రధాని తో బంగ్లా ఆర్మీ పడలేక పోతోంది. కొత్తగా ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని పట్టుబడుతోంది బంగ్లాదేశ్ సైన్యం. మొన్నా మధ్య విద్యార్ధులంతా రోడ్లపైకి వచ్చారు కూడా. పాత ప్రభుత్వం దిగిపోయేటపుడు బంగ్లాలో జరిగిన హింస కూడా ఏమంత తక్కువ కాదు. అలాంటి నేపాల్, బంగ్లా ల్లో ఆయనకు అంతటి శాంతి సౌభ్రాతృత్వాలు ఎక్కడ కనిపిస్తున్నాయో చెప్పాలని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇదంతా భారత్ వ్యతిరేక వాదనలో భాగమని అంటారు చాలా మంది. వీరు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఇక్కడున్న సమస్యలపై విమర్శలు చేయాలిగానీ మన బద్ధ శతృవు పాకిస్తాన్ సొంతిల్లు లాంటిదనడం.. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లు.. ప్రశాంతంగా ఉంటాయనడం సరికాదన్న సలహాలు అందుతున్నాయి.